మెట్రో రైలు అనేది నగరానికి వన్నె తీసుకువచ్చే.. ప్రజారవాణాను సునాయాసంగా మార్చే సదుపాయం అనే విషయం అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే.. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో సాధారణంగా కొన్ని ఏళ్లు గడిచిపోతుంటాయి. అలాంటిది ఏపీలోని కూటమి ప్రభుత్వం ఒకేసారి రెండు నగరాలకు మెట్రో రైలు తీసుకురావాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. విజయవాడ, విశాఖ పట్టణం నగరాల్లో మెట్రో రైలును పరుగులు తీయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులోనూ మరింత గొప్ప సంగతి ఏంటంటే.. ఈ నగరాల్లో మెట్రోరైళ్లను మూడేళ్ల వ్యవధిలోగానే పూర్తిచేసి.. ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మంత్రి నారాయణ ఈ విషయాన్ని ప్రకటించారు.
విజయవాడ, విశాఖపట్టణంలలో మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటిదశ పనులను మూడేళ్లలోగా పూర్తిచేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో మెట్రో పనులకు శుక్రవారం నాడు టెండర్లు పిలవడం జరిగింది. విజయవాడలో పనులకు కూడా మరో మూడు రోజుల్లో టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. రెండు నగరాల్లోను కలిపి.. మొదటి దశ మెట్రో ప్రాజెక్టుకు 21,616 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు మంత్రి వివరించారు.
మొదటిదశకు అవసరమయ్యే నిధుల్లో 20 శాతం కేంద్రం ఇవ్వనుంది. రాష్ట్రం 20 శాతం భరించాలి. మిగిలిన 60 శాతం నిధులను అంతర్జాతీయ బ్యాంకులనుంచి తక్కువ వడ్డీకి అందించే ఏర్పాటు కేంద్రం చేస్తుంది. రాష్ట్ర వాటా 20 శాతం అనేది విశాఖలో నగరపాలక సంస్థ, విజయవాడలో సీఆర్డీయే భరిస్తాయి.
విశాఖలో తొలిదశలో 46.23 కిమీల పొడవున మూడు కారిడార్లలో, విజయవాడలో 38.40 కిమీల పొడవున రెండు కారిడార్లు రానున్నాయి. అదేసమయంలో విశాఖలో 20కిమీలు, విజయవాడలో 4.7 కిమీలు మేర డబుల్ డెకర్ నిర్మాణం చేపట్టనున్నట్టుగా కూడా మంత్రి వివరించారు.
మెట్రో రైల్ లను మూడేళ్ల వ్యవధిలోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సంకల్పం చాలా గొప్పదని ప్రజలు హర్షిస్తున్నారు. ఒకవేళ ఒకింత ఆలస్యం అయినా కూడా.. 2029 ఎన్నికల్లో మెట్రో అందుబాటులోకి వస్తే కూటమి ప్రభుత్వం కార్యనిర్వహణా సామర్థ్యానికి అదొక గొప్ప నిదర్శనం అవుతుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం, రాష్ట్రం చెరిసగం వాటాలు భరించేలా గతంలో కేంద్రం ఒప్పుకుంది. అయితే మొత్తం నిధులు కేంద్రమే ఇవ్వాలని కోరుతూ చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాసి ఉన్నారు. ఆ విషయంలో నిర్ణయం తేడా వచ్చినాసరే.. రాష్ట్ర వాటా భరించడం తప్పదు కాబట్టి మొదటి దశ పనులను తక్షణం ప్రారంభించేస్తున్నారు. ఆలస్యం చేయకుండా టెండర్లు పిలిచి, త్తరితగతిన పనులను ప్రారంభిస్తే అనుకున్న షెడ్యూలు ప్రకారం మూడేళ్లలో మెట్రోపరుగులు సాధ్యమవుతాయని అనుకుంటున్నారు.