చాలామంది మంచి మాటలు చెబుతూ ఉంటారు. ఆచరించే వాళ్ళు తక్కువ. నలుగురికీ ఉపయోగపడేలా ఒక మంచి పని చేయాలని, సంపన్నులు ఉదారంగా ఉండాలని ప్రవచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరైనా ఒక మంచి కార్యక్రమంతో, ఆలోచనతో ముందుకు వస్తే ప్రోత్సహిస్తాం అనే వాళ్ళు ఉంటారు. నలుగురి ఔదార్యంతో సామాజిక హితమొనర్చే మంచి పని గురించిన ఆలోచనలు పంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ ఆలోచనలలో సంకల్పాలలో తాము కూడా భాగంగా మారి తాము ఆచరించడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలిచే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాంటి మంచి పని చేస్తున్నారు. అరుదుగా కనిపించే వ్యక్తుల జాబితాలో చరుతున్నారు. పేదల వికాసం కోసం పీ4 విధానం తీసుకురావడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేదల జీవితాలను బాగు చేయడానికి, సంపన్నుల ఔదార్యాన్ని వాడవచ్చుననే ఒక గొప్ప పథకానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు తాను కూడా అందులో భాగం అవుతున్నారు. ఇలా పేదల కోసం వితరణ చేసే వారిని మార్గదర్శి అనే పేరుతో వ్యవహరిస్తుండగా.. చంద్రబాబు నాయుడు తాను మార్గదర్శిలకే మార్గదర్శిని అని నిరూపించుకుంటున్నారు.
పీ4 విధానం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం తెచ్చిన విధానంలో దాతలను మార్గదర్శులుగా, గ్రహీతలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్టవ్యాప్తంగా 57వేల మందికి పైగా మార్గదర్శులుగా రిజిస్టరు చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయిదు లక్షలకుపైగా ఇప్పటికే బంగారు కుటుంబాలను కూడా ఎంపిక చేశారు. ఆగస్టు 15వ తేదీలోగా 15 లక్షల బంగారు కుటుంబాలను ఎంపిక చేసి.. వారి జీవితాల రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఈ లక్ష్యం అందుకోవడానికి మరో రెండు లక్షల మంది మార్గదర్శులు అవసరం అని భావిస్తున్నారు.
అయితే.. మార్గదర్శులుగా రాదలచుకునే వారికి స్ఫూర్తిలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాను కూడా పీ4లో భాగమై బంగారు కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలో తాను 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని వెల్లడించారు. తన నిర్ణయం ఇంకా అనేక మంది మార్గదర్శులుగా ముందుకు రావడానికి దోహదపడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులు కూడా మార్గదర్శులుగా మారుతున్నట్టు చంద్రబాబు చెప్పారు.
ప్రతిచోటా ఆ ప్రాంతాలనుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడిన వారు, ఆ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వంటి వారిని మార్గదర్శులుగా ఎంపిక చేసి వారిని పీ4లో భాగస్వాముల్ని చేయడానికి ప్రయత్నించాలని.. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందని చంద్రబాబు అంటున్నారు. చొరవ తీసుకోవాలని కలెక్టర్లకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. చంద్రబాబు కేవలం గైడెన్స్ మాత్రం కాకుండా.. తాను కూడా 250 కుటుంబాలను దత్తత తీసుకోవడం అనేది ఆయన మార్గదర్శులకే మార్గదర్శిగా మారే పరిణామం అని పలువురు అంటున్నారు.