సూపర్ సిక్స్ హామీలు, ఇతర మేనిఫెస్టో హామీల విషయంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికతో ముందుకు అడుగులు వేస్తున్నది. సూపర్ సిక్స్ హామీలో మరో బ్రహ్మాస్త్రం వంటి హామీని కూడా త్వరలోనే అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళాలోకం ప్రభుత్వానికి నీరాజనం పట్టే పథకం ఇది. ఆడబిడ్డ నిధి పేరుతో రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు కూడా లబ్ధి చేకూరేలా.. నెలకు రూ.1500 ఇచ్చేలాగా తెలుగుదేశం ప్రకటించిన పథకం అమలుకోసం తుదిరూపు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ ప్రజోపయోగకరమైన, జనాకర్షకమైన ఆరు హామీలను సూపర్ సిక్స్ గా 2023 మహానాడు సమయంలోనే ప్రకటించింది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నదని.. సూపర్ సిక్స్ హామీల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అవి ప్రజల్లోకి బాగా వెళ్లాయి. అంతిమంగా ఎన్డీయే కూటమి గెలిచింది. మేనిఫెస్టోలోని మిగిలిన హామీలతో పాటు, సూపర్ సిక్స్ లోని ఒక్కొక్క హామీని ప్రభుత్వం నెరవేర్చుకుంటూ వస్తోంది. మాట నిలబెట్టుకుంటూ వస్తోంది.
దీపం పథకాన్ని గత ఏడాదిలోనే ప్రారంభించిన చంద్రబాబు, రైతులకు పెట్టుబడి సాయమూ అందిస్తున్నారు. అదేవిధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు అన్నీ జరుగుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ అమల్లోకి వస్తున్నప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి మరియు నీలిమీడియా దళాలు.. సూపర్ సిక్స్ హామీల గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడడం, ప్రజల్లో అభాసుపాలు కావడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆ ఆరింటిలో కీలకమైన ఆడబిడ్డ నిధి పథకం గురించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ పథకానికి రూపకల్పన చేశారని.. రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెళ్లి అయి ఉద్యోగం వచ్చే వరకు కూడా కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వారికి అండగా ఉంటుందని ఆయన ఘనంగా ప్రకటించారు. చెప్పిన మాట చేసిచూపించే వ్యక్తి చంద్రబాబు అని ఆయన కితాబులిచ్చారు. నంద్యాల జిల్లాలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ పథకం విషయంలో ప్రకటన చేయడం విశేషం.
మొత్తానికి ఈ పథకం కూడా కార్యరూపం దాల్చితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇక మాట్లాడ్డానికి, విమర్శించడానికి ఏ పాయింట్లూ మిగలవు అని అనుకోవాల్సి వస్తుంది. వారి నోర్లకు తాళాలు పడుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.