రాజకీయ నాయకులు చాలా వరకు అవినీతి పరులే అయి ఉండొచ్చు గాక.. కానీ.. తమ పరిధిలో ఒక మంచి పని జరుగుతూ ఉందంటే అడ్డుకునే వారు మాత్రం అయి ఉండరు. మరీ దుర్మార్గులైతే ప్రజలకు సమాజానికి జరిగే మంచి పని నుంచి కూడా తమ స్వార్థానికి ఏమైనా పిండుకోవచ్చునా అని చూస్తారు తప్ప.. మంచి జరగకూడదని అనుకునే వారు ఉండరు. అదే తరహా మనిషి గనుక.. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా బుట్టలో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సరికొత్త మద్యం విధానం తీసుకువచ్చినప్పుడు.. యావత్ రాష్ట్ర ప్రజలను ఎలాంటి మెరమెచ్చు బూటకపు మాటలతో మాయ చేశారో.. డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా అదే విధంగా బుట్టలో పడేశారు. ఆయన కళ్లకు గంతలు కట్టి, ఆయన పర్యవేక్షిస్తున్న శాఖలో ఏకంగా మూడున్నర వేల కోట్ల రూపాయల దందా నడిపించారు. ఈ బాగోతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగన్ సీఎం అయ్యాక కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చారు. దాని రూపకల్పనే వేల కోట్లరూపాయల ప్రజాధనాన్ని అడ్డంగా బొక్కేయడానికి అన్నట్టుగా జరిగింది. అదే సమయంలో జగన్ కులాలు వర్గాల ప్రాతిపదిక మాత్రమే ముఖ్యం అన్నట్టుగా నలుగురు డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని కూడా నియమించుకున్నారు. ఆ నలుగరిలో ఒకడు ఎస్సీ వర్గానికి చెందిన నారాయణ స్వామి. మంత్రుల్ని మాత్రమే కాదు కదా.. డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని కూడా నూటికి నూరుశాతం డమ్మీలుగా మార్చేసి.. తన ఇష్టానుసారంగా తాను తలచిన ప్రతిదందాను నడిపించిన నాయకుడు జగన్. ఆ క్రమంలో డిప్యూటీ నారాయణస్వామి కూడా డమ్మీ అయ్యారు. నిజానికి ఆయన ఆ ప్రభుత్వకాలంలోనే తన సొంత నియోజకవర్గరంలో పలు కార్యక్రమాల్లో బాహాటంగా తన విలాపాన్ని వెళ్లగక్కారు కూడా. అలాంటిది.. నారాయణస్వామి చూస్తున్న ఎక్సయిజు శాఖలో ఇంతపెద్ద కుంభకోణం జరిగితే.. ఆయనకు ఎలాంటి సమాచారమూ తెలియదట. సిట్ పోలీసులు తాజాగా ఆయనను పిలిపించి విచారణ చేస్తున్నప్పుడు ఆయన ఈ సంగతే వెల్లడించారు.
‘ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించే మద్యం దుకాణాలు తీసుకువస్తే మద్యం వినియోగం తగ్గుతుందని, ప్రజలను మద్యం నుంచి దూరం చేయవచ్చునని మాత్రమే నాతో చెప్పారు.. అంతకుమించి ఈ విధానం గురించి నాకేమీ తెలియదు’ అని నారాయణ స్వామి సిట్ పోలీసుల విచారణలో వెల్లడించారు. రాజ్ కెసిరెడ్డి ఎవరో కూడా తనకు తెలియదని ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి.. యావత్తు రాష్ట్ర ప్రజలను కూడా ఇదే మాటలతో మోసం చేశారు. మద్యం నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. గెలిచిన తర్వాత.. ప్రభుత్వమే దుకాణాలు నడుపుతుందని ప్రకటించి, రేట్లు భారీగా పెంచేసి, తనతో లాలూచీపడని బ్రాండ్లు రాష్ట్రంలో నిషేధించి.. ఈ చర్యలన్నీ కూడా ప్రజలతో మద్యం అలవాటు మాన్పించడానికే అని బుకాయించారు. డిప్యూటీ సీఎం కూడా అదే బుట్టలో పడ్డారు.
సోమవారం నారాయణస్వామి విజయవాడకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆరోగ్య కారణాల వల్ల రాలేనని చెప్పారు. అయితే తిరుపతి నుంచి ఒక ఇన్స్పెక్టరును ఆయన ఇంటికి పంపి.. వీడియో కాల్ ద్వారా 20 నిమిషాలు పాటు సిట్ పోలీసులు విచారించినట్టు సమాచారం.