రాజమండ్రి జైల్‌ను ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చాలా?

మూడున్నర వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పాలకులే కాజేయడం వెనుక మాస్టర్ మైండ్ గా వ్యవహరించి ప్రస్తుతం రిమాండుఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి… జైలులో తనకు అదనపు సదుపాయాలు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ కోరికల జాబితా చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. జైలులో ఇలాంటి సదుపాయాలు కూడా కోరడానికి అవకాశం ఉంటుందా అని నివ్వెరపోవాల్సిందే. ఒక్క ఎయిర్ కండిషనర్ తప్ప అన్ని ఆధునిక నివాస సదుపాయాలను మిథున్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆయన కోరికలు తీర్చడానికి  అభ్యంతరాలుంటే చెప్పాలని ఏసీబీ కోర్టు రాజమండ్రి జైలు సూపరింటెండెంటును ఆదేశించింది. మంగళవారం ఆయన స్వయంగా కోర్టుకు వచ్చి అభ్యంతరాలు చెప్పిన తర్వాత.. కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
మిథున్ రెడ్డి కోరికల జాబితా ఏంటో చూద్దాం.

టిఫినుతో సహా మూడుపూటలా ఇంటినుంచి  భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపు మంచం, కొత్త దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ ఉన్న ప్రత్యేకమైన గది, అందులో టీవీ, సేవలందించేందుకు ఒక సహాయకుడు, డైలీ న్యూస్ పేపర్స్, దోమతెర, వాకింగ్ షూలు, యోగ మ్యాట్, ప్రొటీన్ పౌండర్, ఒక టేబుల్, తెల్లకాగితాలు, పెన్నులు ఇవన్నీ కావాలని మిథున్ రెడ్డి కోరుతున్నారు.

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఆయన మూడోసారి నెగ్గి ఎంపీగా పనిచేస్తున్నారు. ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంటుంది. అయితే అవన్నా సాధారణంగా బయటి జీవనంలో ఉన్నప్పుడు. మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ నిందితుడిగా.. ప్రత్యేక వసతుల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. అక్కడ ఒక ఖైదీలాగా గడపాల్సిందే. కాకపోతే పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు గనుక.. కొన్ని అదనపు సదుపాయాలు దక్కుతాయి. వాటికోసం ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుమతి తీసుకోవాలి. అంతవరకు బాగానే ఉందిగానీ.. మిథున్ రెడ్డి అడిగిన సౌకర్యాల జాబితా చూసిన వారికి కళ్లు తిరుగుతున్నాయి.
తనను ఉంచిన గదిని ఎయిర్ కండిషన్ చేయించాలనే కోరిక తప్ప దాదాపుగా అన్ని రకాల కోరికలు మిథున్ రెడ్డి కోరినట్టుగా కనిపిస్తోంది. సాధారణంగా మంచం, పరుపు కావాలని వయస్సు మళ్లిన అనేకమంది ఖైదీలు పిటిషన్లు వేసి కోరుతూ ఉంటారు. కానీ.. మిథున్ రెడ్డి.. ప్రత్యేకించి మంచం, కొత్తపరుపు, కొత్త దిండ్లు అంటూ నొక్కి వక్కాణించడం తమాషాగా ఉంది.

మిథున్ రెడ్డి డిమాండ్లు చూసిన వారు మాత్రం.. ఇవన్నీ కల్పించాలంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలును ఒక ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చాల్సి ఉంటుందేమోనని నవ్వుకుంటున్నారు. దాని బదులుగా రాజమండ్రిలోనే ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్లో ప్రెసిడెన్షియల్ సూట్ తీసుకుని, ఆ సూట్ రూము చుట్టూతా జైలు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయడం బెటర్ అని కూడా గేలిచేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories