ప్రస్తుతం బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో సేదతీరుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి మరో అవకాశం దొరికింది. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా సరే పరామర్శలు పలకరింపులు సానుభూతి అంటూ యాత్రలు నిర్వహించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22వ తేదీన మంగళవారం రాష్ట్రానికి రానున్నట్టుగా సమాచారం. సోమ లేదా మంగళవారాల్లో రాష్ట్రానికి వచ్చి బుధవారం నాడు జైలులో రిమాండు ఖైదీగా ఉండబోయే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖత్ రూపంలో కలవాలని అనుకుంటున్నట్టుగా పార్ీట వర్గాలు చెబుతున్నాయి.
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ అరెస్టును తీవ్రస్థాయిలో ఖండిస్తున్నారు. సుదీర్ఘంగా ఏడుగంటలకు పైగా విచారించిన అనంతరం పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి లోగా ఆయనను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని ఖచ్చితంగా రిమాండుకు పంపే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.
అదే సమయంలో అరెస్టు అయిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలేంటి? వెంటనే బయటకు రావడానికి ఉన్న మార్గాలేంటి అనే విషయంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెండు రోజులుగా తన న్యాయవాదులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటినుంచి.. ఆయన ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. తొలుత శనివారం మరోసారి ముందస్తు బెయిలు పిటిషన్ సుప్రీంలో వేయాలని అనుకున్నప్పటికీ.. దానివల్ల ఉపయోగం లేదని న్యాయనిపుణులు చెప్పారు. అరెస్టు అయిన తర్వాత బెయిలుకు అవకాశం ఉన్నదని ఆయనకు న్యాయవాదులు హామీ ఇచ్చినట్టుగా సమాచారం.
అయితే, న్యాయమూర్తి ఖచ్చితంగా రిమాండుకు పంపుతారని.. రిమాండుకు వెళ్లిన తర్వతా వెంటనే బెయిలు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదని న్యాయనిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసు కస్టడీకి తీసుకుని కొన్ని రోజుల పాటూ విచారించాల్సిన అవసరం ఉన్నదని పోలీసులు ఆయన పిటిషన్లకు అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసినప్పుడు సుప్రీం కోర్టు వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆయనను అరెస్టు చేయకుండా అసలు విచారణ ఎలా పూర్తవుతుందని సుప్రీం పేర్కొంది. అందుకే ముందస్తు బెయిల్ కోరికను తిరస్కరించింది. లొంగిపోవడానికి పదిరోజుల సమయం ఇవ్వడానికి కూడా తిరస్కరించింది. సుప్రీం అంత స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో.. తొలుత రిమాండుకు పంపి, ఆ తర్వాత పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ పూర్తి చేసే వరకు మిథున్ రెడ్డికి బెయిలు లభించడం సాధ్యం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచిచూడాలి.