మిథున్ అరెస్టుకోసం వేచిచూసిన వైసీపీ నేతలు!

ఈ రకమైన వాక్యం చూస్తే కొంచెం చిత్రంగా అనిపిస్తుంది గానీ.. ఇది నిజం. ఎందుకంటే.. మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డిని శనివారం నాడు పోలీసులు అరెస్టు చేయబోతున్నారనే సంగతి.. శుక్రవారం నాటికే అందరికీ తేటతెల్లం అయిపోయింది. ఆయన అరెస్టుకోసం పోలీసులు శుక్రవారం నాడే వారంటుకు ప్రయత్నించిన నేపథ్యంలో ఆ విషయంలో దాపరికం లేకుండాపోయింది. అరెస్టు తప్పదని తెలిసీ.. శనివారం నాడు కూడా ముందస్తు బెయిలు కోసం సుప్రీంలో మరో పిటిషన్ వేయించడానికి మిథున్ రెడ్డి తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.

అయితే దాని వల్ల ఫలితం ఉండదని, అరెస్టు అయిన తర్వాత బెయిలు కోసం ప్రయత్నిస్తే చాన్సుంటుందని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టుకు సిద్ధపడే మిథున్ రెడ్డి సిట్ పోలీసుల ఎదుటకు వచ్చారు. అయితే.. రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా.. పొద్దుపోయిన తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎప్పుడెప్పుడు అరెస్టు అవుతాడా అని ఎదురుచూస్తూ గడిపారు. ఎందుకంటే..

మిధున్ రెడ్డి అరెస్టు గురించి ముందుగానే తెలిసిపోయింది కాబట్టి.. తాడేపల్లి ప్యాలెస్ లో శనివారం ఉదయంనుంచి కూడా తత్సంబంధిత కసరత్తు ప్రారంభం అయింది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత ఏం చేయాలనే విషయంలో వైసీపీ అగ్రనాయకులు, వ్యూహకర్తలు అందరూ కూర్చుని మల్లగుల్లాలు పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటికి రెండు రోజుల ముందే యలహంక ప్యాలెస్ కు చేరిపోయారు. మిధున్ రెడ్డి అరెస్టును రాష్ట్రంలోనే ఒక అతిపెద్ద సమస్యగా చిత్రీకరించాలని, కూటమి ప్రభుత్వం మీద నిరసనలు వ్యక్తం చేయడానికి ఒక అతిపెద్ద అస్త్రంగా మార్చుకోవాలని తాడేపల్లి ప్యాలెస్ వ్యూహాలు నిర్ణయించాయి.

ఉదయం నుంచి కూడా.. రాష్ట్రవ్యాప్తంగా మూలమూలలా ఉన్న నాయకులు అందరికీ పురమాయింపులు వెళ్లాయి. అందరికోసం తాడేపల్లిలోనే స్క్రిప్టులు తయారయ్యాయి. నాయకులందరికీ పంపబడ్డాయి. మిథున్ రెడ్డిని అరెస్టు చేసే సమయాన్ని బట్టి.. వీలైన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి.. ఈ అరెస్టును ఖండించాలని.. కార్యకర్తలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు వ్యక్తం చేయాలని ఆదేశాలు, మార్గదర్శకాలు వెళ్లాయి.

అయితే మిథున్ రెడ్డి.. అసలు మద్యం స్కామ్ అనేది జరగనేలేదని, తాను ఎంపీగా ఉండగా, రాష్ట్రంలో జరిగే లిక్కర్ పాలసీ రూపకల్పనలో తనకు సంబంధం ఎందుకు ఉంటుందని.. మిథున్ రెడ్డి విచారణాధికారులను ఎదురు ప్రశ్నించారు. ఆయన సహకరించకపోవడంతో.. విచారణ సుదీర్ఘంగా సాగింది. దాదాపు ఏడుగంటలకు పైగా మిథున్ రెడ్డిని విచారించిన పోలీసులు.. రాత్రి 9 గంటలు సమయంలో ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు.

అరెస్టు సమాచారాన్ని ఆయన బంధువులకు తెలియజేశారు.
అప్పటికి బాగా రాత్రి కావడంతో.. అప్పటిదాకా తాడేపల్లినుంచి ఆదేశాలు అందుకున్న రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా.. ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం కూడా లేకపోయింది. అందరూ ట్విటర్ ఖాతాల్లో తమ ఖండనల్ని హోరెత్తించారు. కొందరు నాయకులు.. అత్యంత శ్రద్ధతో ఆ వేళలో కూడా ఒక పర్సనల్ వీడియో ఖండనలను షూట్ చేసుకుని..  మీడియాకు విడుదల చేశారు. అలా ఖండించడం కోసం.. అరెస్టు అయ్యేదాకా వైసీపీ నాయకులందరూ ఎదురుచూసి, ఖండనలను విడుదల చేసిన తర్వాత శాంతించారు. అంతసేపూ ఎఫ్పుడెప్పుడు అరెస్టు చేస్తారా? అని ఎదురుచూస్తూ గడిపారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories