అంత శ్రద్ధ ఉంటే నగరికి వెళ్లి ధర్నా చేయొచ్చు కదా..!

సోషల్ మీడియా అనేదానిని ప్రస్తుత రాజకీయ నాయకుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి వాడుకున్న స్థాయిలో బహుశా మరెవ్వరూ వాడుతూ ఉండకపోవచ్చు. ఆయన ‘కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు.. ఇక ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అని తీర్మానించుకున్న నాయకుడిగా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఏదో పరామర్శల పేరుతో జనాన్ని పోగేసి డ్రామాలు నడిపించడానికి తప్ప ఆయన ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఎంత కీలకమైన అంశాలైనా సరే వాటి గురించి ట్విట్టర్లో మాత్రమే తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. అంతకుమించి క్రియాశీల భూమికను పోషించడం రాజకీయ నాయకుడి బాధ్యత అనే విషయాన్ని ఆయన ఎన్నడో మరచిపోయారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటూ ఉంటాయి.

తాజా పరిణామాలను గమనిస్తే నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అవినీతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమె అవినీతి తారస్థాయికి చేరినదని, రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుందని ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విమర్శించారు. ఈ ఇద్దరు నాయకులు ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకునే క్రమంలో భాగంగానే ఈ విమర్శలు వచ్చాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం ఈ విమర్శల్లో బూతు కనిపించింది. లేని బూతులు వెతికి, వాటిని  పదే పదే ప్రచారం చేస్తూ రోజాను అసభ్యంగా తిట్టిన గాలి భాను ప్రకాష్ మీద చర్యలు తీసుకోవాలి అని రెండు మూడు రోజులుగా వైసిపి నాయకులందరూ తెగ రెచ్చిపోతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి కనీసం ట్వీట్ చేయడానికి కూడా మూడు రోజులు అవసరమైంది. ఇన్నాళ్లకు ఆయన రోజా వ్యవహారంలో జరుగుతున్నది ఏమిటో తెలుసుకొని ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాలి భాను ప్రకాష్ ను అరెస్టు చేయాలి అని తన ట్వీట్ లో డిమాండ్ చేశారు.

‘‘మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్‌కె రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం.
వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు.

నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు.
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్‌కె రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.’’ అని జగన్ ట్వీట్ చేశారు.

ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన ప్రజానాయకుడు.. తన సోదరిగా చెప్పుకునే ఒక మహిళా నాయకురాలికి అవమానం జరిగిందని నిజంగానే భావిస్తూ ఉంటే కనుక ఇంకా ప్యాలెస్ లో కూర్చుని ఏం చేస్తున్నట్టు? ఆ మహిళ ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడం తన బాధ్యత అని నిజంగానే నమ్ముతూ ఉంటే గనుక చక్కగా నగరికి వెళ్లి ఎమ్మెల్యే భాను ప్రకాష్ అరెస్ట్ కోసం రోడ్డు మీద కూర్చుని ధర్నా చేయవచ్చు కదా అనేది పార్టీ కార్యకర్తల కోరిక. జగన్ యలహంక ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు బయట పెట్టకుండా ట్వీట్ ల ద్వారా మాత్రమే రెచ్చిపోతూ ఉంటాను అంటే పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందని వారు భయపడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories