వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి విచారిస్తున్న సిట్ పోలీసుల ఎదుట ఇవాళ (శనివారం) విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఒకసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. అప్పట్లో ఆయనను సాక్షిగా వివరాలు అడిగి తెలుసుకోవడానికి సిట్ విచారణఖు పిలిచింది. అయితే మద్యం కుంభకోణం అనేదే జరగలేదని.. జరగని దాని గురించి వివరాలు అడిగితే తాను ఏం చెప్పగలను అని మిథున్ రెడ్డి అప్పట్లో వారికి జవాబులిచ్చారు. ఆ తరువాత.. ఆయన పేరు నిందితుల జాబితాలోకి కూడా వచ్చింది. ఆయనను సిట్ పోలీసులు ఏ4 గా చేర్చారు. ఏ4 అయిన తర్వాత.. మిథున్ రెడ్డి పోలీసులు విచారణకు హాజరవుతుండడం ఇదే తొలిసారి. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు.. ఇటు హైకోర్టులోను, అటు సుప్రీం కోర్టులోను తిరస్కరణకు గురైన తర్వాత.. ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులో కోర్టులో వారంటు కూడా సమర్పిస్తున్న తరుణంలో ఆయన శనివారం విచారణకు రానున్నారు. విచారణ పూర్తయని వెంటనే మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేస్తారని సమాచారం. శనివారం సాయంత్రం ఆయనను అరెస్టు చేస్తే.. ఆదివారం కోర్టులకు సెలవు గనుక.. సోమవారం నాడు రిమాండు నిమిత్తం కోర్టు ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంతా అనుకుంటున్ానరు.
దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన మద్యంకుంభకోణం వెనుక ప్రధానమైన మాస్టర్ మైండ్స్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఒకరు. అలాగే.. అంతిమలబ్ధిదారుగా చెబుతున్న బిగ్ బాస్ తర్వాత.. ఈ కుంభకోణం ద్వారా అత్యధికంగా లబ్ధిపొందిన వ్యక్తి కూడా మిథున్ రెడ్డే అని సిట్ విచారణలో తేల్చారు.
ఈ కుంభకోణానికి సంబంధించి అనేకమందిని విచారించిన సిట్ పోలీసులు శనివారం నాడే ప్రిలిమనరీ చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ క్రమాన్ని పరిశీలిస్తే.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డిని తొలిదశలో విచారించినప్పుడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోయినా.. కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ముందస్తు బెయిలుకోసం పిటిషన్లు వేసి ఆయన అప్పట్లోనే నవ్వులపాలు అయ్యారు. ఇప్పటిదాకా ఆయన ముందస్తు బెయిలు ప్రయత్నాలు నడుస్తూనే వచ్చాయి. చివరికి హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా వాటిని తిరస్కరించాయి. కనీసం లొంగిపోవడానికి గడువు ఇవ్వడానికి కూడా సుప్రీం ఒప్పుకోలేదు. ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేయబోతున్న తరుణంలో చివరగా మిథున్ రెడ్ది విచారణకు హాజరు కాబోతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారని తెలుస్తోంది.
శనివారం నాడు కూడా ముందస్తుబెయిలు కోసం సుప్రీంలో మరో ప్రయత్నం చేయాలని లాయర్లను సంప్రదించినప్పటికీ అది సాధ్యం కాదని వారు చెప్పినట్టుగా తెలుస్తోంది. శనివారం అరెస్టు అయితే.. ఆ తరువాత బెయిలు రావడానికి అవకాశం ఉంటుందని న్యాయవాదులు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మిథున్ రెడ్డి ఇవ్వాళే కటకటాల్లోకి వెళ్లబోతున్నారని అంతా అనుకుంటున్నారు.