రోజా తిట్లు వైఎస్ జగన్ కు టార్గెట్ చేసినట్టు ఉన్నాయే..

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కు, మాజీ ఎమ్మెల్యే రోజాకు మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు. వీరిద్దరూ రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించే విధంగా మాటలు రువ్వుకుంటున్నారు. తమాషా ఏంటంటే.. ఇదంతా కూడా నగరి నియోజకవర్గం మీదుగా.. అక్రమ రవాణా అవుతున్న ఇసుక లారీలను పోలీసులు పట్టుకోవడం వల్ల ప్రారంభం అయింది. అయితే తాజాగా గాలి భానుప్రకాష్ పై రెచ్చిపోయిన ఆర్కే రోజా.. ఆయనను విచ్చలవిడిగా తిట్టారు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆమె తిట్లు అన్నీ కూడా.. అచ్చంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తిట్టిన తిట్లు లాగా కనిపిస్తున్నాయి. జగన్ కు వర్తించేవిగా కనిపిస్తున్నాయి.

నగరిలో ఇటీవల పోలీసులు ఇసుక స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడు లారీలను పట్టుకున్నారు. వాటితో పాటు కొందరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కూడా.. ఏపీలో ఉచితంగా దొరుకుతున్న ఇసుకను అక్రమంగా సరిహద్దులు దాటించి అధికధరలకు అమ్ముకుంటూ వైసీపీ వారు ఇంకా దందా సాగిస్తున్నారన్నమాట. తమ పార్టీ స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసేసరికి రోజాకు కోపం వచ్చింది. ఆమె తెగ రెచ్చిపోతూ  ఇసుక సహా బియ్యం, లిక్కరు కూడా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్ చేయిస్తున్నారంటూ రకరకాల పసలేని ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు ఎంత కామెడీగా ఉన్నాయంటే.. వైసీపీ హయాంలో ఏపీలో లిక్కరు మంచి బ్రాండ్లు దొరికేవి కాదు.. పైగా ఇక్కడ నడ్డివిరిచేంత బీభత్సమైన ధరలుండేవి. ఆ పరిస్థితుల్లో సరిహద్దుల్లో వైసీపీ నాయకులే నిత్యం పొరుగురాష్ట్రాలనుంచి మద్యం స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు కోట్లు గడించారు. కూటమి ప్రభుత్వం పాలన వచ్చిన తర్వాత.. మద్యం ధరలు దిగిరావడంతో పాటు, అన్ని బ్రాండ్లు దొరుకుతుండడంతో అసలు లిక్కర్ స్మగ్లింగ్ అనే దానికి అర్థమే లేకుండాపోయింది. అలాంటిది రోజా అమాయకంగా లిక్కర్ స్మగ్లింగ్ అని కూడా అంటున్నారు.
రోజా అవినీతి గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమె పనులు చేయడానికి రెండువేల రూపాయలకు చేయి సాచేదని’’ ఆమె అవినీతిపై గాలి భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. దీనికి జవాబుగా ఆమె గాలి భాను ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి.. నానా తిట్లు తిట్టారు. పోలీసు కంప్లయింటు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘నీ తల్లే నిన్ను ఛీత్కరించుకుంది. నీ తోడబుట్టిన వాళ్లే నీ చెల్లెలే నిన్ను ఛీత్కరించుకుంది’’ అంటూ రెచ్చిపోయారు. సరిగ్గా ఈ మాటలే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకంటే.. గాలి భానుప్రకాష్ విషయం ఏమోగానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నట్టే ప్రజలకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కన్న తల్లి మీద తనకు గతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని, ఆమెకు అప్పుడు గిఫ్టు డీడ్ గా ఇచ్చిన షేర్లను తిరిగి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ లో కేసు నడుపుతున్నారు. ఆస్తులకు కక్కుర్తి పడి కూతురుకు దారుణమైన అన్యాయం చేశాడని, తన వాటాను తిరిగి అడిగే హక్కు లేదని వైఎస్ విజయమ్మ ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన అఫిడవిట్ల సాక్షిగా జగన్ ను ఛీత్కరించుకుంటోంది. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. జగన్మోహన్ రెడ్డిని ఒక రాక్షసుడిగా పేర్కొంటూ ఎన్ని రకాల విమర్శలకు దిగుతున్నారో లెక్కేలేదు. రోజా తిడుతున్న తిట్లు అచ్చంగా ఆమె పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సరిపోతాయని ఆ పార్టీ వారే అనుకుంటున్నారు.
తమాషా ఏంటంటే.. తల్లి ఛీత్కరించుకుంటోంది.. చెల్లి ఛీత్కరించుకుంటోంది.. అని రోజా తిట్టిన తిట్లను కనీసం ఎడిట్ చేయకుండా.. సాక్షి చానెళ్లలో కూడా ప్రసారం చేస్తుండడం!

Related Posts

Comments

spot_img

Recent Stories