తమరి పిలుపుకు పార్టీలో స్పందన ఉందా జగన్!

అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో రాష్ట్రప్రజలకు ఏం చేశామో చెప్పడంతో పాటు, రాబోయే రోజుల్లో ఏమేం చేయబోతున్నామో వివరించడం, అలాగే వారి సమస్యలను కూడా తెలుసుకుని పరిష్కరించడం అనే లక్ష్యంతో చంద్రబాబునాయుడు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అయితే అధికార కూటమి ఇలా ప్రజల్లోకి వెళ్లడం కూడా చూసి ఓర్వలేకపోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తొలిఅడుగుకు పోటీగా, ఒక కార్యక్రమానిక పిలుపు ఇచ్చారు. తన పార్టీ నాయకులు కూడా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబునాయుడు ఏడాదిలో చేసిన మోసాలను (?) ప్రజలకు తెలియజెప్పాలని ఆయన పిలుపు ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ.. చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేసుకుందాం’ అని ఈ కార్యక్రమానికి పేరు పెట్టారు. అయితే ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న నాయకుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. జగన్ మాత్రం తనకు గుర్తువచ్చినప్పుడు.. పార్టీ నాయకులతో సమావేశమై ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నదని అడగడం.. అంతటితో చేతులు దులుపుకోవడం జరుగుతోంది. అయినా ఇంతకూ తమరు ఇచ్చిన పిలుపునకు తమ సొంత పార్టీలో అయినా.. కనీసం ఒక్క నాయకుడైనా స్పందిస్తున్నాడా? ప్రజల్లో తిరుగుతున్నారా? తమ నిఘా వర్గాల ద్వారా.. తమ సొంత గూఢచారుల ద్వారా ఆ సంగతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
‘జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేసుకుందాం’ అనే కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ కావడానికి మొదటి కారణం.. ఆయనే’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే.. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలనే ఒక కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. సాధారణ ఎమ్మెల్యేలకంటె చురుగ్గా తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఊరూరా తిరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఇప్పటిదాకా పిలుపు ఇచ్చిన ఏ ఒక్క కార్యక్రమంలో కూడా తాను స్వయంగా పాల్గొన్నది లేదు. ఆయనకే లేని శ్రద్ధ పార్టీ వారికి మాత్రం ఏముంటుంది? అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ ముమ్మరంగా తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాక్షి మీడియా కు అవి కనిపించవు గనుక వారిని పక్కన పెడితే తక్కిన మీడియాల్లో తొలిఅడుగు కార్యక్రమాల గురించిన వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తూనే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చిన చంద్రబాబు వ్యతిరేక కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ప్రజల్లో నిర్వహిస్తూ ఉంటే.. ఆ వార్తలు కనీసం సాక్షి చానెల్లో అయినా కనిపించాలి కదా అనేది ప్రజల సందేహం. వైసీపీ నాయకులు ఎంతసేపూ ప్రెస్ మీట్లు పెట్టడం, లేదా, కార్యకర్తల సమావేశాలు పెట్టడం.. కూటమి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం చేస్తున్నారు తప్ప.. జగన్ పిలుపును వారు బేఖాతరు చేస్తున్నారు. కూటమి ఏడాది పాలన తర్వాత ప్రజల్లోకి వెళ్లి బాబు సర్కారు పనిచేయడం లేదని నిందలు వేయాలంటే భయపడుతున్నారు.

తాను పిలుపు ఇచ్చిన కార్యక్రమం సొంత పార్టీ నాయకులు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దారుణంగా ఫ్లాప్ అయితే.. దానిని గుర్తించకపోవడం జగన్ వైఫల్యం అనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తన సొంత పార్టీవారిలోనే లేని దృక్పథంతో పోరాడాలని జగన్ అనుకుంటే గనుక.. గాల్లో కత్తి తిప్పుతూ యుద్ధం చేసినట్టే ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories