దేశం మొత్తం నిర్ఘాంతపోయేలా మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో అంతిమలబ్ధిదారు అయిన బిగ్ బాస్ ఎవరు? ఈ విషయం గురించి వివిధ సందర్భాల ప్రెస్ మీట్ లలో విలేకరులు అడిగినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎంత డొంకతిరుగుడుగా, నర్మగర్భంగా మాట్లాడినప్పటికీ.. ప్రజలకు మాత్రం ఆ బిగ్ బాస్ సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డే అనే ఊహ కలుగుతూ వచ్చింది. జగన్ మార్గదర్శకత్వంలోనే పార్టీకోసం భారీగా నిధులు వసూలు అయ్యేలా మద్యం పాలసీ రూపకల్పన జరిగిందని విచారణ తొలిదశలోనే రాజ్ కెసిరెడ్డి చెప్పినట్టుగా సిట్ పేర్కొంది. అయితే క్రమేమీ ఎవరెవరికి ఎంత వాటాలు దక్కాయో కూడా లెక్కతేల్చారు.
ఈ ప్రకారం.. మొత్తం 3500 కోట్లలో 90 శాతం వసూళ్లు అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ కే చేరినట్లుగా సిట్ పోలీసులు లెక్క తేల్చారు. ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారులు అయిన మిగిలిన నాయకులు, ఇతరులు అందరూ కలిసి పంచుకున్నది పది శాతం వసూళ్లేనని నిగ్గు తేల్చారు.
3500 కోట్లలో పది శాతం అంటే తక్కువేమీ కాదు. ఆ ప్రకారం.. ఇతర నాయకులందరూ కలిసి వాటాగా పంచుకున్న మొత్తమే 350 కోట్ల వరకు ఉంటుంది. ఈ సొమ్మును అవినీతి దందాల సొమ్మును వసూలు చేసిన నెట్వర్క్ లో కీలకంగా ఉన్న క్యాష్ కొరియర్లు, కాష్ హ్యాండ్లర్లు అందరికీ ఇవ్వడానికి, అలాగే ఈ స్కామ్ లో భాగస్వాములైన ఇతర వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ ముడుపులుగా అందజేయడానికి, కొందరు అధికారులకు లంచాలుగా చెల్లించినట్టు సిట్ తేల్చింది.
నిందితుల సెల్ ఫోన్ల నుంచి కీలక సమచారాన్ని వెలికి తీసిన తర్వాత.. ఈ లెక్కలన్నింటినీ సిద్ధం చేశారు. మొత్తం పాపపు సొమ్ములో 90 శాతం అంటే దాదాపుగా 2970 కోట్లు బిగ్ బాస్ కు చేరాయని అంచనాకు వచ్చారు.
డొల్ల కంపెనీలను అడ్డు పెట్టుకుని హవాలా మార్గాల్లో ఈ అవినీతి సొమ్ములో సింహభాగం విదేశాలకు తరలించినట్టు, బెంగుళూరు, హైదరాబాదుల్లో భూములపై పెట్టుబడిగా పెట్టినట్టు సిట్ గుర్తించింది.
ఈ లెక్కలు తేల్చడంలో వెలికి వచ్చిన మరో సంగతి ఏంటంటే.. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలకు వసూళ్ల సొమ్మునుంచి ప్రతినెలా 5 కోట్ల వంతున చేరవేసేవారిన సిట్ గుర్తించింది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాగా, రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డికి కొంతకాలం తర్వాత ఈ ముడుపుల వాటాలు అందజేయడం మానేశారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెందిన కంపెనీల్లోకి నేరుగా 5 కోట్లు డిపాజిట్ కావడంతో ఆయన పాత్ర తేటతెల్లమైంది. ఆ డబ్బును తిరిగి వెనక్కు పంపినప్పటికీ.. మిథున్ రెడ్డి ఆ సొమ్ములకు జవాబుదారీతనం వహించవలసిన చిక్కుల్లో పడ్డారు. పైగా ఆయన ముందస్తు బెయిలు పిటిషన్ కూడా ఇప్పటికే తిరస్కరణకు గురైంది.
మొత్తానికి కుంభకోణానికి సహకరిస్తున్న కీలక అధికారులకు కూడా నెలకు 50లక్షలు, 20 లక్షల వంతున వాటాలు పంచినట్టుగా తేల్చారు. ఈ రకంగా.. నాయకులు, అధికారులు అందరూ కలిసి.. 350 కోట్లరూపాయలను వాటాలుగా పంచుకున్నారు. మిగిలిన 90 శాతం అనగా సుమారు 2970 కోట్ల రూపాయలను బిగ్ బాస్ కు అందజేశారు. మరి సిట్ పోలీసులు ‘బిగ్ బాస్’ ఎవ్వరో కూడా తేల్చిన తర్వాత.. లిక్కర్ స్కామ్ కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది.