రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా ఇండోసోల్ కంపెనీ కోసం భూములు కేటాయించడం అనే వ్యవహారం ఇప్పుడు నానా రాద్ధాంతం అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ఇండోసోల్ కంపెనీ కోసం భూములను మూడువేల ఎకరాల భూములను కేటాయించడం జరిగింది. అవి కాకుండా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని కరేడు లో వారికి అవసరమైన భూములు ఇవ్వడానికి, గతంలో ఇచ్చిన చేపూరునుంచి తరలించేందుకు ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందుకు వ్యతిరేకంగా భూములు ఇచ్చేది లేదని స్థానిక పంచాయతీ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి పంపింది. ఇప్పుడు కడేరు రైతులకు తాను అండగా నిలుస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇస్తున్నారు. ఆయన కడేరు వెళ్లి రైతులకు ఆ మాట ఇవ్వలేదు. రైతులను తనవద్దకు పిలిపించుకుని ఆ మాట చెప్పి పంపారు.
అయితే.. దీని వెనుక చాలా పెద్ద హైలెవెల్ డ్రామా ఉన్నట్టుగా అనుమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఇండోసోల్ కంపెనీ అనేది.. జగన్ యొక్క బినామీ, అనుచర సంస్థల్లో ఒకటి అనే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆ కంపెనీ ఆవిర్భావం, వారికి మూడువేల ఎకరాల భూముల కేటాయింపు అన్నీ జగన్ హయాంలోనే జరిగాయి. ఆ సంస్థకు తెరవెనుక అండగా ఉన్నది జగన్మోహన్ రెడ్డే అనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇండోసోల్ కు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కరేడు రైతులు, తమకు న్యాయం జరగడం కోసం జగన్ నే ఆశ్రయించడం అనేది.. తాముగా వెళ్లి ఆయన ఉచ్చులో చిక్కుకున్నట్టే అని పలువురు అనుమానిస్తున్నారు. కందుకూరు వైసీపీ ఇన్చార్జి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో కడేరు రైతులు వెళ్లి జగన ను కలవడం జరిగింది. గతంలో ఇండోసోల్ కంపెనీకి చేపూరు వద్ద భూములు ఇప్పించి, రైతులకు 417 కోట్ల పరిహారం కూడా ఇప్పించాం అని ఆయన అంటున్నారు.
అయితే అక్కడినుంచి ఇండోసోల్ తరలకుండా ఉండాలనే ఉద్దేశంతో వైసీపీ దళాలే తెరవెనుకనుంచి ఈ కడేరు రైతుల్లో వ్యతిరేకతను నింపుతున్నట్టుగా తెలుస్తోంది.
కడేరు రైతుల ఉద్యమాలకు ఇన్నాళ్లుగా మద్దతు ఇస్తూ వచ్చిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఇప్పుడు ఆ పోరాటం నుంచి తప్పుకున్నారు. ఇండోసోల్ కంపెనీకి అసలు బినామీలతో నడిపిస్తున్న యజమాని జగన్మోహన్ రెడ్డి కాగా.. రైతులు అమాయకంగా వెళ్లి ఆయననే న్యాయం కోసం ఆశ్రయించడం వల్ల తాను పోరాటంనుంచి తప్పుకుంటున్నట్టుగా ఆయన వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి యజమానిగా ఉన్న ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ కంపెనీకి జగన్ కు సన్నిహితమైనదే అయినప్పటికీ.. కేవలం రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారు చేయడం.. అలాగే.. కూటమి ప్రభుత్వంలో పరిశ్రమల పట్ల రాజకీయ కక్ష సాధింపులు ఉండవని నిరూపించుకునేందుకు చంద్రబాబు దానిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం.. కూటమి హయాంలో అసలు పెట్టుబడులే రాష్ట్రానికి రాకూడదనుకుంటున్నట్టుగా, దీనిని కూడా అడ్డుకోడానికి సిద్ధమవుతుంుడడం గమనార్హం.