కేసు కొట్టేయండి’ అనడమే ఒక ఫ్యాషన్ అయిన వేళ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్నటిదాకా ఒకరకం ఆటలు ఆడుతూ వచ్చారు. వారు చేసిన నేరాలకు సంబంధించి వారిమీద కేసులు నమోదు అయినప్పుడు.. వెంటనే కోర్టుకు వెళ్లిపోవడం.. ముందస్తు బెయిలు అడగడం, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరడం, అలాగే.. రాజకీయంగా తమను వేధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం మామూలైపోయింది. జగన్ 2.0  పరిపాలన ఎప్పటికి వస్తుందో గానీ.. జగన్ 2.0 తెలివితేటలు మాత్రం ఆయన పార్టీ నాయకులందరికీ ఇప్పుడే అబ్బుతున్నాయి. కేసులు మోపబడిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు.. నా మీద పెట్టిన కేసును కొట్టేయండి అంటూ కోర్టును ఆశ్రయిస్తున్నారు.

రెంటపాళ్ల వెళుతూ.. ఒక వృద్ధదళిత కార్యకర్తను బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. పోలీసులు కేసు నమోదు చేస్తే.. కోర్టను క్వాష్ చేయాల్సిందిగా ఆశ్రయించారు. కేసు విచారణను నిలిపి వేయాల్సిందిగా కోర్టు ఆదేశించిందే తప్ప.. కేసు కొట్టేయలేదు. కానీ.. జగన్ స్ఫూర్తి మాత్రం ఆయన పార్టీ వారందరికీ బాగానే ఎక్కింది. ఇప్పుడు.. అసలు చెప్పేదేం అక్కర్లేదు.. మాటల్లో తెలియజెప్పాల్సిన పనిలేదు అని అంటూ.. ‘‘చెప్పి కాదు చెప్పకుండి నిరికివేయాలి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. పొద్దునలేచాక పరామర్శకు వెళ్లాలి’’ అంటూ కార్యకర్తలను, హింసకు హత్యలకు ప్రేరేపించేలాగా మాట్లాడిన వ్యవహారంలో తన మీద నమోదైన కేసును కొట్టేయాలని పేర్ని నాని తాజాగా కోర్టును ఆశ్రయించారు.

కొన్ని రోజులుగా రెచ్చిపోతున్న పేర్ని నాని విపరీతంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి అందరూ గమనిస్తున్నదే. ఈ క్రమంలో భాగంగానే రప్పారప్పా అంటూ చెప్పడం కాదు.. చెప్పకుండానే నరికేయాలని కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బందరు తెదేపా నాయకుడు లోగిశెట్టి వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ.. పేర్నినాని ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు జరగకుండా ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అడుగుతున్నారు.
కామెడీ ఏంటంటే.. ఆయన మాటలు వీడియోల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండగా.. ‘తనమీద చేసినవి నిరాధార ఆరోపణలు’ అని ఆయన అంటుండడం! ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే ఫిర్యాదులో పేర్కొన్నారని, పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని పేర్నినాని పిటిషన్ వేశారు.

కొంతభాగం పేర్కొన్నారా.. పూర్తిపాఠం పేర్కొన్నారా? అనే చర్చకు ఇక్కడ చాన్సు ఏమున్నదో అర్థం కావడం లేదు. ఒకవేళ పూర్తిపాఠం ప్రసంగం పేర్కొంటే.. ‘చెప్పికాదు చెప్పకుండా నరికేయాలి’ అనే వ్యాఖ్యల అర్థం పూర్తిగా మారిపోయి.. అవతలి వారిని పూలమాలలతో సన్మానించాలి అన్నట్టుగా వస్తుందా? అని జనం జోకులేసుకుంటున్నారు. కొంతభాగమా కాదా పక్కన పెడితే.. అసలు ఆ మాటలు పేర్ని నాని అన్నాడా లేదా అనే దానిని బట్టి మాత్రమే కేసు ఉంటుంది కదా.. అని జనం చర్చించుకుంటున్నారు. ఆ కేసులో జగన్ కు దొరికినంత ఈజీగా పేర్ని నానికి ఈ కేసు నుంచి విముక్తి దొరక్కపోవచ్చునని భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories