ప్రముఖ నటి బి. సరోజాదేవి కన్నుమూతతో తెలుగు సినీ రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 1938లో జన్మించిన సరోజాదేవి 1955లో సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎంతో మందిని తన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు భాషల్లోనూ ఆమె 200కు పైగా చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు.
ఈ సందర్భంగా నటుడు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ తీవ్ర సంతాపం తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ సరసన సరోజాదేవి దాదాపు రెండు దశాబ్దాల పాటు నటించారని, ఆ కాలంలో వారు కలిసిన ప్రతి సినిమా పెద్ద విజయాలు సాధించాయని గుర్తు చేశారు. అంతేకాకుండా, తమిళంలో ఎంజీఆర్, కన్నడలో రాజ్ కుమార్‌లతో కలిసి ఆమె చేసిన జోడీలు కూడా అప్పట్లో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించాయని చెప్పారు.
సరోజాదేవి అటు నటి గానూ, ఇటు వ్యక్తిత్వంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచారని బాలకృష్ణ చెప్పారు. అటువంటి గొప్ప నటి ఇక మన మధ్య లేరన్న విషయం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమకు, ప్రేక్షకులకు సరోజాదేవి మరణం ఒక పెద్ద లోటుగా మారింది. మరువలేని పాత్రలతో, మధురమైన నటనతో ఆమె ఎన్నటికీ గుర్తుండిపోతారు.