బనకచర్ల తథ్యం.. అటునుంచి నరుక్కు రానున్న చంద్రబాబు

దాదాపు యాభైవేల ఎకరాలకు నీరందించడానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంకల్పిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే.. పూర్తిచేసి తీరాలనే కృతనిశ్చయంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీ వాడుకోదలచుకుంటున్నది.. కేవలం సముద్రంలో కలిసిపోతున్న వ్యర్థ జలాలను మాత్రమే అయినప్పటికీ.. తెలంగాణలో ఈ ప్రాజెక్టు రాజకీయ అంశంగా మారిపోయింది. బనకచర్లను అడ్డుగా పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కారును ఇరుకున పెట్టడానికి భారత రాష్ట్రసమితి నాయకులు, ప్రత్యేకించి హరీష్ రావు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

ఈనెల 14న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబునాయుడు అక్కడి కేంద్రం పెద్దలతో మాట్లాడి బనకచర్లకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టు గురించి అనవసరమైన రాద్ధాంతం జరుగుతోంది. నిజానికి ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పడానికి తెలంగాణకు హక్కులేదు. వృథాగా వేల టీఎంసీల మిగులుజలాలు సముద్రంలో కలుస్తుండగా.. భారత రాష్ట్ర సమితి అనవసర వివాదం రేకెత్తిస్తోంది. వాటిలో కేవలం 200 టీఎంసీల నీటిని మాత్రమే తాము వాడుకుంటాం అని ఏపీ ప్రభుత్వం తొలినుంచి చెబుతూనే ఉంది. అలాగే.. కేంద్రప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ కూడా.. ఈ ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయనం నిర్వహించి.. దీనికోసం వాడదలచుకుంటున్న నీళ్లు మొత్తం మిగులు జలాలు మాత్రమే అని తేలుస్తూ నివేదికను కూడా ప్రభుత్వానికి  సమర్పించింది.

అయితే బనకచర్ల వల్ల తెలంగాణకు వచ్చిన నష్టమేమీ లేదనే సంగతి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టంగానే తెలుసు. అయితే భారాస చేస్తున్న రాద్ధాంతం, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండడం వల్ల వారు ఆ విషయం బయటకు చెప్పలేకపోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇవ్వవద్దంటూ వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

బనకచర్ల నిర్మించుకోడానికి ఏపీ సర్కారుకు ఏ రకంగా హక్కు ఉన్నదో.. అందులో తెలంగాణ కు నష్టం లేకపోవడం ఎంత నిజమో.. చంద్రబాబు గణాంకాల సహా కేంద్రానికి వివరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు నచ్చజెప్పి, వాస్తవాలను వారికి తెలియజేసి,  కేంద్రమే పూనిక వహించి అనుమతులు ఇచ్చేలా ఆయన ప్రయత్నించనున్నారు. కేంద్రప్రభుత్వంలో చంద్రబాబు కూడా కీలక భాగస్వామిగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన మాటకు ఢిల్లీలో చెల్లుబాటు ఉంటుంది. ఈ అయిదేళ్ల పదవీకాలంలో బనకచర్ల ప్రాజెక్టును కూడా పనులు ప్రారంభించాలనే సంకల్పంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. 

Related Posts

Comments

spot_img

Recent Stories