వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ఆంతరంగికుడు, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి , లిక్కర్ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మళ్లీ ఒకసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీచేశారు. దేశాన్నే కుదుపుతున్న మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం విచారణ ప్రాథమిక దశలో ఉన్న సమయంలో.. విజయసాయిరెడ్డిని ఒకసారి విచారణకు పిలిపించారు. అప్పటికే పార్టీకి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి ఉన్న విజయసాయిరెడ్డి పోలీసుల విచారణకు హాజరైన సాక్షిగా అనేక విషయాలను వెల్లడించారు. తన నివాసంలోనే మద్యం కొత్తపాలసీ తయారీకి సంబంధించిన ప్రాథమిక సమావేశాలు జరిగినట్టు కూడా వెల్లడించారు. ఎవరెవరు పాల్గొన్నారో కూడా చెప్పారు. ఆయన చెప్పిన అనేక సంగతుల ఆధారంగానే విచారణ ఊపందుకుంది. చాలా పేర్లు కొత్తగా లిక్కర్ స్కామ్ లోకి జతచేరాయి. ప్రస్తుతం నిందితుల సంఖ్య 40 వద్ద ఉంది. పలువురు అరెస్టు అయి ఉన్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. చాలా మంది అరెస్టు కావడానికి తగిన విధంగా తనవద్ద ఉన్న సమాచారం తెలియజెప్పిన విజయసాయిరెడ్డి కూడా నిందితుల్లో ఒకరు. అలాంటి నేపథ్యంలో.. సిట్ పోలీసులు 12 వతేదీ శనివారం, విజయవాడలోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా నోటీసులు పంపారు. అయితే ఇప్పుడు ఆయన ఏకొత్త సంగతులు వెల్లడించబోతున్నారనేది కీలకంగా ఉంది.
గతంలో సాక్షిగా విచారణకు హాజరైనప్పుడే.. మద్యం స్కామ్ కు సంబంధించి తనకు తెలిసిన వివరాలన్నీ పోలీసులకు చెప్పేసానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఆ తర్వాత పలువురిని విచారించడం ద్వారా పోలీసులు ఈ స్కామ్ కు సంబంధించి అనేక వివరాలను సేకరించారు. వాటన్నింటినీ.. తొలినుంచి ఈ స్కామ్ లో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ని మరోసారి విచారించడం ద్వారా ధ్రువపరచుకోవాలని పోలీసులు అనుకుంటున్నారా అనేది చర్చనీయాంశం. ఈసారి విచారణలో మరికొందరు కీలకవ్యక్తుల పాత్ర బయటకు వస్తుందేమోనని కూడా అనుకుంటున్నారు. మూడున్నరవేల కోట్లరూపాయల ముడుపులలో.. పాత్రధారులు అందరూ తలాకొంచెం స్వాహా చేయగా.. వేల కోట్ల రూపాయల అంతిమ లబ్ధి మాత్రం బిగ్ బాస్ కు చేరిందనేది తొలినుంచి వార్తల్లో వస్తూనే ఉంది. ఆ పరిస్థితుల్లో బిగ్ బాస్ ఎవరో.. విజయసాయిరెడ్డి ద్వారా చెప్పించే ప్రయత్నం కూడా జరగవచ్చునని అనుకుంటున్నారు.
లేదా.. ఇతర నిందితులు అందించిన సమాచారాన్ని బట్టి.. విజయసాయిరెడ్డికి ఆయన చెప్పుకుంటున్నదాని కంటె పెద్ద పాత్ర ఈ కుంభకోణంలో ఉన్నట్టుగా పోలీసుల వద్ద ఇప్పటికే ఆధారాలు చేరి ఉంటే గనుక.. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసినా కూడా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.