మన మంత్రులు సాఫ్టా? చేతకావడం లేదా?

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఏడాదిలో ఏం సాధించామో.. ఇంకా ఏమేం చేయబోతున్నామో చెప్పడానికి, అలాగే, ఏడాది తర్వాత కూడా ప్రజలు ఎలాంటి సమస్యలను ఫీలవుతున్నారో తెలుసుకోవడానికి, నాలుగేళ్లలో వారికి పరిష్కారం చూపడానికి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ప్రభుత్వ పనితీరును సీఎం చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు.. సర్వేల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా మదింపు చేస్తున్నారు. కేవలం ప్రజాభిప్రాయాల్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా, ఆత్మపరిశీలన కూడా ఈ దశలో ఎంతో అవసరం. అదే పనిచేస్తున్నారా నారా చంద్రబాబునాయుడు. తాజాగా అమరావతిలో నిర్వహించిన కేబినెట్ భేటీలో ఆయన మంత్రుల్లో పలువురి పనితీరుపై అసహనం వ్యక్తంచేశారు. వారి వ్యవహార సరళి ఆశించినంతగా లేదని, వారి వెనుకబాటుతనం కారణంగా.. ప్రభుత్వం చేసిన మంచి కూడా ప్రజలకు చేరడం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు.

కేబినెట్ భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. కీలకమైన రాజకీయ అంశాల మీద కూడా మీరు మాట్లాడకుండా మౌనం పాటిస్తుంటే ఎలా? అని సహచర మంత్రుల్ని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలు చేస్తోంటే వాటిని ఎప్పటికప్పుడు ఎండగట్టడానికి ఎందుకు సిద్ధంగా ఉండడం లేదని ప్రశ్నించారు. నెల్లూరులో మహిళా ఎమ్మెల్యేని దారుణంగా అవమానిస్తే.. అసభ్యంగా మాట్లాడితే.. అలాంటివాటిపై కూడా మంత్రులందరూ తమ తమ స్థాయుల్లో స్పందించకపోతే ఎలా అని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఇలా నిర్లిప్తంగా ఉండిపోతుండడం వల్ల.. ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా తగిన స్థాయిలో ప్రజల్లోకి ప్రచారం జరగడం లేదని ఆయన బాధను వ్యక్తం చేశారు.

ఈ విషయంలో చంద్రబాబునాయుడు ఆవేదన చాలా సబబుగానే కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఏగోల చేసినా సరే.. ఒక సమీకృతమైన ఎఫర్ట్ కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక టాపిక్ ప్రారంభించారంటే.. ఒక అబద్ధాన్ని చెప్పడం ద్వారా ప్రభుత్వం మీద నింద వేయడానికి పూనుకున్నారంటే.. ఇక అక్కడినుంచి ఆ పార్టీ నాయకులందరూ చెలరేగిపోతారు. అదే అబద్ధాన్ని తామందరూ పదేపదే అనడం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ తెలుగుదేశం లేదా కూటమి పార్టీల వైపు నుంచి ఆ అబద్ధాలను ఖండించే ప్రయత్నం కూడా చాలా పరిమితంగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఒకరిద్దరు నాయకులు స్పందించి ఖండిస్తారు తప్ప.. సూటిగా విమర్శలను, అబద్ధాలను తిప్పికొట్టే ప్రయత్నం తక్కువ. ప్రతిదానికీ చంద్రబాబునాయుడు తప్ప.. మిగిలిన వారిజోక్యం తక్కువగా ఉంటోంది. అసలు ఏపీలో మంత్రులు సాఫ్ట్ గా ఉంటున్నారా? లేదా, విమర్శలను తిప్పికొట్టడం కూడా వారికి చేతకావడం లేదా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. చంద్రబాబునాయుడు ఆశిస్తున్న విధంగా.. నాయకులందరూ దీటుగా స్పందించే ప్రయత్నం చేయాలని అంతా అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories