మూడున్నర వేలకోట్లరూపాయలు కాజేసిన లిక్కర్ కుంభకోణం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. జగన్ సూత్రధారిగా.. ఆయనకే అంతిమలబ్ధిని చేకూర్చడానికి అందరూ కలిసి సాగించిన ఈ దందాలో మరో కీలక అధికారిని ఇప్పుడు సిట్ పోలీసులు విచారించబోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసులు జారీచేసింది. రజత్ భార్గవ ప్రస్తుతం రిటైరై ఉన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సిట్ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. కొత్త లిక్కర్ పాలసీని తయారుచేసి తద్వారా వేల కోట్లు కొల్లగొట్టడంలో ఆశాఖలో అప్పటి కీలక అధికారిగా ఆయన పాత్ర కూడా ఉన్నదని, జరిగిన వ్యవహారాలు అన్నీ ఆయనకు తెలుసునని.. వాటన్నింటి వివరాలు రాబట్టడానికే విచారణకు పిలిచారని అంటున్నారు. అయితే రజత్ భార్గవను విచారించడంతో సరిపెడతారా.. విచారణ పర్వం ముగిసే సమయానికి ఆయనను కూడా నిందితుల జాబితాలో చేర్చి అరెస్టు చేస్తారా? అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా జగన్ రెడ్డి సర్కారు దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకోవడంలో, డిస్టిలరీల ద్వారా దోచుకోవడంలో.. రజత్ భార్గవ సహకారం కూడా కీలకం అని సిట్ పోలీసులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు. అప్పట్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారని.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఏ అనూష అనే మహిళకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చారు. అందుకోసం స్పెషల్ మెమో ఇచ్చి మరీ నియామకం చేపట్టారు. ఆమె ప్రధానమైన డ్యూటీ ఏంటంటే.. కార్పొరేషన్ నుంచి ఏయే డిస్టిలరీలకు ఎంతెంత ఆర్డర్లు వెళ్లాయో తెలుసుకుని, ఆ వివరాలు మొత్తం ప్రతిరోజూ ఒక షీట్ తయారుచేసి దానిని వాట్సప్ ద్వారా.. రాజ్ కెసిరెడ్డి ముఠాలోని కీలక సభ్యుడు సైఫ్ అహ్మద్ కు పంపేవారు. ఎవరికి ఎంత ఆర్డర్లు వెళ్లాయనేది డేటా రాగానే.. సైఫ్ అహ్మద్.. ఎవరినుంచి ఎంత ముడుపులు వసూలు చేయాలో లెక్కలు తయారుచేసి ఆమేరకు తమ నెట్వర్క్ ను పురమాయించేవాడు. ఆ లెక్కలు రాజ్ కెసిరెడ్డికి వెళ్లేవి. డబ్బులు వసూలు అయ్యేవి. అంతా కలిపి ముప్పిడి అవినాష్ రెడ్డి, బూనేటి చాణక్య ద్వారా ఆ ముడుపుల సొమ్ము మొత్తం బిగ్ బాస్ కు చేరేది అని సిట్ ఇప్పటికే తేల్చింది.
ఈ మొత్తం వ్యవహారంలో రజత్ భార్గవ పాత్ర గురించి సిట్ వద్ద అనేక ఆధారాలున్నాయని సమాచారం. ఇప్పుడు ఆయనను విచారణకు పిలుస్తున్నారు. కేవలం కేసులో మరిన్ని వివరాలు రాబట్టడానికి మాత్రమేనా? లేదా, సాయంత్రానికి ఆయనను కూడా నిందితుల జాబితాలో చేరుస్తారా? అనేది తెలియడం లేదు.