ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు యావత్ రాష్ట్రానికి ఒక శుభవార్త చెప్పారు. నిజానికి ఈ శుభవార్త అమరావతి నగర నిర్మాణానికి సంబంధించినది మాత్రమే అయినప్పటికీ.. అయిదేళ్ల రాజధాని సంక్షోభాన్ని చూసిన, ఏవగించుకున్న, ఆందోళన చెందిన రాష్ట్రప్రజలందరికీ కూడా ఇది శుభవార్తే. అదేంటంటే.. అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్వార్టర్లు కేవలం మరో అయిదు నెలల్లోగా పూర్తవుతాయని స్పీకరు ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ క్వార్టర్లు డిసెంబరుకెల్లా పూర్తవుతాయని ఆయన అంటున్నారు. కేవలం ఇవి మాత్రమే కాదు.. 35 మంత్రుల క్వార్టర్లు, 36 న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణం కూడా వచ్చే ఏడాది మార్చి నాటికెల్లా పూర్తవుతుందని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. రాష్ట్రప్రజలందరికీ ఇది శుభవార్తే.
నిజానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలోనే రాజధాని అమరావతిలో మంత్రుల, న్యాయమూర్తుల, ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణాన్ని చేపట్టింది. శరవేగంగా పనులు చేస్తూ వచ్చారు. దాదాపుగా 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఆ దశలో 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాజధాని అమారవతి మీద ఆయన ఏ స్థాయిలో పగబట్టారో అందరికీ తెలుసు. రాజధాని ప్రాంతాన్ని స్మశానంగా మార్చేశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా అయిదేళ్ల పదవీకాలాన్ని నెట్టేశారు. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆయన పనులు కొనసాగించనేలేదు. కనీసం 80 శాతం పూర్తయిన నిర్మాణాలను ముగించి వాడుకలోకి తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అన్ని రకాలుగానూ అమరావతిపై పగబట్టారు. తీరా ప్రజల తీర్పుతో 11 సీట్లకు పరిమితమై ఇంట్లో కూర్చున్నారు.
చంద్రబాబు 4.0 ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. రాజధానిలో అన్ని రకాల నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించిన సర్కారు.. ఈ క్వార్టర్ల నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తిచేస్తోంది. మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో పెరగబోయే అసెంబ్లీ స్థానాలతో అదనంగా వచ్చే ఎమ్మెల్యేలకు కూడా కలిపి సరిపోయేలా ఈ క్వార్టర్లను నిర్మిస్తున్నట్టుగా స్పీకరు అయ్యన్న పాత్రుడు చెబుతున్నారు. తాజాగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన అయ్యన్నపాత్రుడు.. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, సోలార్ పవర్ వంటి ఏర్పాట్లు కూడా చేపట్టాలని సూచనలు చేసినట్టుగా చెప్పారు. ఈ క్వార్టర్ల వద్దనే స్పీకరు, డిప్యూటీ స్పీకరు, మండలి ఛైర్మన్, ఉపఛైర్మన్ లకు ప్రత్యేక గుర్తింపు ఉండేలా నివాసాలు నిర్మించాలని కూడా సూచించినట్టు చెప్పారు. సీఎం, ముఖ్యమంత్రి నివాసాలు మాత్రం కృష్ణానది పక్కనే వస్తాయని అంటున్నారు.
మొత్తానికి రాజధానిలో కొన్ని నివాస సముదాయాలు పూర్తవుతుండడం చాలా శుభపరిణామం. ఈ జోరుతో రైతులకు దక్కిన ప్లాట్లలో ప్రెవేటు నిర్మాణాలున కూడా జోరందుకునే అవకాశం ఉంది. ఒకవైపు ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలన్నీ రాత్రీ పగలూ తేడాలేకుండా జరుగుతున్నాయి. ప్రెవేటు నిర్మాణాలు కూడా ప్రారంభం అయితే.. రాజధాని నగరానికి అనుకున్న గడువుకుంటే ముందే కాస్త తుదిరూపు వచ్చినా ఆశ్చర్యం లేదు.