ఒక మహిళా ఎమ్మెల్యే గురించి మరొక మాజీ ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడడం అనేది బహుశా ఎవ్వరి ఊహకు అందే విషయం కాకపోవచ్చు. రాజకీయంగా ఎంతో కీలకం అయినప్పటికీ.. ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో అలాంటి సంచలనాన్ని నమోదు చేశారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి వంటి విలువలున్న నాయకుడి కొడుకుగా రాజకీయ రంగప్రవేశం చేసి.. జగన్ పంచన చేరి భ్రష్టుపట్టిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి.. తనకు చెల్లెలి వరస అయ్యే మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యంగా తప్పుడు మాటలు మాట్లాడడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. వేమిరెడ్డి కుటుంబం రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజాసేవలో ఎంత చురుగ్గా, ఉదారంగా ఉంటారో తెలిసిన ప్రజలు.. స్వానుభవంలో వారి మంచితనాన్ని ఎరిగిన ప్రజలు.. ఆవేశంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిమీదికి వెళ్లి ఆయన ఇంట్లో ఫర్నిచర్ ను ధ్వంసం చేస్తే దానిని కూడా రాజకీయం చేయడానికి ఆయన సిగ్గుమాలిన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. నల్లపురెడ్డి ప్రసన్న మాట్లాడిన మాటలకు ఈ శాస్తి తక్కువే కదా.. అని ప్రజలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతి గురించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రస్తావించారు. నిజానికి ఈ ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం సుదీర్ఘకాలంగా నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లిపోయి కోవూరులో తనను ఓడించిన ప్రశాంతిరెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డికి.. దుగ్ధ ఉంది. అయితే.. ప్రశాంతి రెడ్డి కేవలం ఆయన అవినీతి గురించి మాత్రమే మాట్లాడారు. వైసీపీ పాలన కాలంలో ఆయన తన నియోజకవర్గంలో సాగించిన దందాల గురించి మాత్రమే ప్రస్తావించారు. ఆయన అవినీతిలో పీహెచ్డీ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
నిజానికి ప్రసన్న కుమార్ రెడ్డి.. విలువలు ఉన్న రాజకీయ నాయకుడే అయితే గనుక.. ఆమె విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పి ఉండాలి. ఆమె పాల్పడుతున్న, కావలిస్తే.. ఆమె భర్త , ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి అవినీతికి పాల్పడుతూ ఉంటే.. వాటి గురించి మాత్రమే మాట్లాడాలి. అయినా వారి అవినీతి గురించి మాట్లాడడం తనకు చేతకాదన్నట్టుగా.. ప్రసన్న కుమార్ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం చవకబారుతనం. ఆమె వేమిరెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారని, ఆమె చరిత్ర మొత్తం తనకు తెలుసునని చాలా చవకబారుగా ప్రసన్న మాట్లాడారు.
ప్రశాంతి చాలా స్పష్టంగా ఒక సవాలు విసిరారు. వైసీపీ నాయకులు ఎవ్వరైనా సరే.. ప్రసన్న తన గురించి మాట్లాడిన మాటల వీడియోను తమ ఇళ్లలో భార్య, చెల్లెళ్లు, అమ్మలకు చూపించండి. వారు గనుక.. ఆ వీడియో చూసి చెప్పుతో కొట్టకుండా ఉంటే.. అప్పుడు ఆయనను సమర్థించండి అని ఆమె సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించే దమ్ము ఎవ్వరికీ లేదు. కానీ ప్రసన్నను వెనకేసుకు వస్తున్నారు.
అదే సమయంలో ప్రసన్న ఇంటిమీద జరిగిన దాడిని రాద్ధాంతం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఇంటిమీద జరిగిన దాడి చాలా చిన్నదే కదా అని పలువురు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇలాంటి చవకబారు మాటలు మరోసారి మాట్లాడితే.. పరిణామాలు దారుణంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు.