వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళెం వద్ద మామిడిరైతులను పరామర్శించడానికి వెళుతున్నాననే మిషమీద ఎంత గందరగోళం సృష్టించాలనుకుంటున్నారో అంతా చేస్తున్నారు. పోలీసులు వద్దు వద్దని చెబుతున్నా కూడా.. వేల మందిని పోగేయడానికి జగన్మోహన్ రెడ్డి దళాలు ప్రయత్నించాయి. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. కిరాయికి మనుషుల్ని తోలించడంతో వారు అనుకున్నట్టుగానే జనం బాగానే వచ్చారు. జగన్ దళాలు.. బంగారుపాళెం మార్కెట్ యార్డు వద్ద పోలీసులను తోసేస్తూ.. లోపలకు చొరబడి నానా యాగీచేశారు. దారిపొడవునా కూడా.. జనం పెద్దసంఖ్యలో జగన్ కాన్వాయ్ తో పాటుగా రచ్చ చేశారు. అయితే.. ఈ క్రమంలో ఒక వ్యక్తి గాయపడడంతో దాని గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగానీ, సాక్షి మీడియా గానీ చేస్తున్న ప్రచారాలు అసహ్యం పుట్టిస్తున్నాయి. ఒక దుర్ఘటన జరిగితే వక్రభాష్యాలు చెప్పడం ఇవాళ్టి రాజకీయాల్లో మామూలైపోయింది. అందులో కూడా ఇంత సిగ్గుమాలిన చవకబారు వక్రప్రచారాలు మరొకటి ఉండవేమో అనే స్థాయిలో వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
విషయం ఏంటంటే.. హెలిపాడ్ నుంచి జగన్ ప్రయాణిస్తున్న వాహనం మీదికి ఎగబడడానికి వైసీపీ కిరాయి మూకలు ప్రయత్నించారు. ఆ క్రమంలో పోలీసులు వారిని నియంత్రించేందుకు తమ వంతు ప్రయత్నం తాము చేశారు. అయితే కార్యకర్తల మధ్యనే తోపులాటలు జరిగాయి. అందులో ఒక వ్యక్తి కింద పడిపోయాడు తల మీద దెబ్బతగిలింది. నెత్తురు కూడా వచ్చింది. కట్టు కూడా కట్టారు.
ఒక వ్యక్తికి దెబ్బ తగిలిన క్షణంనుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు రెచ్చిపోయి వక్రప్రచారాలకు దిగాయి. పోలీసులే కొట్టి గాయపరిచారంటూ విపరీతమైన దుష్ప్రచారం ప్రారంభించారు. ఒకవైపు సాక్షి ఛానెల్లోనే లైవ్ వార్తల కార్యక్రమంలో.. పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డాడని చెప్పడం ప్రారంభించారు. అదే సమయంలో స్థానిక రిపోర్టరును కాల్ లోకి తీసుకుని అతడిని అడిగినప్పుడు.. అతను చాలా స్పష్టంగా.. తోపులాటలో కార్యకర్త కిందపడిపోయినందువలన అతనికి తలపై గాయమైందని చెప్పినప్పటికీ.. చానెల్ యాంకర్ మాత్రం శాంతించడం లేదు. అతను లాఠీచార్జీలోనే గాయపడ్డాడా.. అని పదేపదే అడిగి.. చివరికి అతనితో అదే మాట చెప్పించారు.
వ్యక్తి గాయపడిన మాట నిజం. అయితే అతను కార్యకర్తల తోపులాటలోనే కిందపడి దెబ్బతగిలితే.. పోలీసుల లాఠీచార్జీ అంటూ ఆరోపించడం చవకబారుతనం.
పైగా జగన్మోహన్ రెడ్డి ఈ నాటకాన్ని మరింత రక్తి కట్టించడానికి ప్రయత్నించారు. తాను ప్రయాణిస్తున్న కారు దిగి.. గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్తానని ఆయన ప్రయత్నించడంతో.. జిల్లా ఎస్పీ ఆయనను అడ్డుకుని తిరిగి కారులో కూర్చోబెట్టి పంపడం కూడా జరిగింది. ఇంతటి దుర్మార్గాలకు వైసీపీ దళాలు పాల్పడుతుండడం పట్ల ప్రజలు చీదరించుకుంటున్నారు.