విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. ఇప్పుడంటే.. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు గనుక.. విదేశాలలో వైద్యవిద్య చదివి వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు గానీ.. ఆయన పాలనకాలంలో.. విద్యార్థుల జీవితాలతో ఆయన అత్యంత దారుణంగా ఆడుకున్నారు. ఆయనకు కాంట్రాక్టు పనుల మీదనే శ్రద్ధ.. ఆ రూపేణా తన వారికి దోచిపెట్టడం మీదనే శ్రద్ధ.. తానేదో ఉద్ధరించేసినట్టుగా ప్రచారం చేసుకోవడం మీదనే శ్రద్ధ. అంతేతప్ప నిర్దిష్టంగా.. నలుగురికీ ఉపయోగపడేలా పనిచేయడం మీద ఆయనకు ఫోకస్ లేదు. దాని ఫలితమే.. ఇప్పుడు ఆయన ప్రారంభించిన కాలేజీలకు అనుమతులు లేక అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు నానా పాట్లు పడుతున్నారు.
పశువైద్య మండలి అనుమతులు లేకుండా జగన్ సర్కారు గతంలో విజయనగరం జిల్లా గరివిడిలో పశువైద్య కళాశాలను ప్రారంభించింది. అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రద్ధచూపించి ఢిల్లీ పెద్దలను కూడా కలవడంతో ఎట్టకేలకు అనుమతులు వచ్చాయి. 3, 4 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులకు కేంద్రం ఊరట కల్పించింది.
కానీ.. కడపలో తన తండి పేరిట జగన్ ప్రారంభించిన వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి ఏమిటి? దానికి ఇప్పటిదాకా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (సీఓఏ) అనుమతులు లేవు. 2020లో ఈ యూనివర్సిటీని జగన్ ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన గానీ, కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గానీ.. అనుమతులు తీసుకురావడం గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్సు పూర్తిచేస్తున్న విద్యార్థులకు భవిష్యత్తు అయోమయంగా ఉంది. వీరి తరఫున షర్మిల రంగంలోకి దిగి.. జగన్ చేసిన తప్పును సరిదిద్దాలని చంద్రబాబునాయుడును కోరుతున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి జయంతి సందర్భంగా.. ఇవాళ పులివెందులలోనే ఉన్నారు. అక్కడే వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి కనీస మానవత్వం ఉంటే.. తన తప్పిదం వల్ల నష్టపోతున్న ఆ విద్యార్థుల శిబిరం వద్దకు వెళ్లి వారికి కాస్త ఊరట కల్పించే మాటలైనా చెప్పవచ్చు కదా.. అని ప్రజలు కోరుకుంటున్నారు.
అయిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. అనేక మార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. కనీసం తన తండ్రి పేరుతో ఏర్పాటుచేసిన యూనివర్సిటీకి అనుమతులు రాబట్టడం గురించి పట్టించుకోకపోవడం అనేది కేవలం ఆయన దుర్మార్గానికి నిదర్శనం అని పలువురు అంటున్నారు. బంగారుపాళెం రైతుల వద్దకు వెళతా.. అంటూ డ్రామాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. తన పాపం కారణంగా రోడ్డున పడుతున్న విద్యార్థుల గురించి కూడా పట్టించుకుని, వారి వద్దకు వెళ్లి వారి కడుపుమంట ఏంటో తెలుసుకుంటే బాగుంటుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.