ఒకసారి ఎన్నికల్లో గెలిచిపోయిన తరువాత.. మళ్లీ ప్రజల ఎదుటకు రావడానికి నాయకులు ఇష్టపడరు గానీ.. నిజానికి ప్రజలు చాలా ఉదార స్వభావులు. అల్పసంతోషులు కూడా. నాయకులు వారికి కనిపించి, వారితో మాట్లాడి.. వారికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటిని పరిష్కరించడానికి తాము శ్రద్ధగానే ఉన్నాం అని చెబితే చాలు.. వారు తృప్తిగా ఉంటారు. నాయకులు తమను గెలిచిన తర్వాత అసలు పట్టించుకోలేదు అనే దిగులు లేకుండా ఉంటారు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంకల్పానికి ప్రతిరూపంగా.. టీడీపీ, కూటమి పార్టీల నాయకులు అందరూ.. సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను, నెరవేర్చిన హామీలను ప్రజలకు తెలియ చెబుతూన్నారు. అలాగే ప్రజలు కూడా స్థానికంగా వాటికి ఉన్న సమస్యలను నాయకులకు నివేదిస్తున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తూ.. కొన్నిటి విషయంలో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ నాయకులు ముందుకు సాగుతున్నారు.
మొత్తానికి సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం పూర్తిగా సుహృద్భావ వాతావరణంలో ప్రశాంతంగా జరుగుతోంది. కూటమిపార్టీల నాయకులు కూడా తమ ఎన్నికల హామీల్లో ఏమేం పెండింగ్ ఉన్నాయో.. ముందుగానే చెప్పి.. వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తామో కూడా ప్రజలకు చెబుతున్నారు. సూపర్ సిక్స్ హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తమ చిత్తశుద్ధిని నాయకులు ప్రకటిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడినప్పుడు మళ్ళీ ప్రజల వద్దకు రావడం కాకుండా.. ఏడాదికే నాయకులు తమ ఇళ్ల వద్దకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం ప్రజల్లో సంతోషం నింపుతోంది.