పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “హరిహర వీరమల్లు” మరోసారి భారీ మాస్ అంచనాల్లోకి ఎంటర్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ విజువల్స్ చూస్తేనే సినిమా ఎంత గ్రాండ్ గా తెరకెక్కించారో స్పష్టంగా అర్థమవుతుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ మంచి ట్రీట్ లా మారింది.
ఇక ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తికర వార్త ఒకటి బయటకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకను జులై 19న తిరుపతిలో ఎంతో గ్రాండ్ గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే చోట ప్రీరిలీజ్ ప్లాన్ చేశారు కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. నిర్మాణ బాధ్యతలు తీసుకున్నది ఎమ్ ఎమ్ రత్నం. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే దర్శకత్వ బాధ్యతలు జ్యోతి కృష్ణ తీసుకోగా, క్రియేటివ్ గైడెన్స్ లో క్రిష్ జాగర్లమూడి కూడా కీలక పాత్ర పోషించారు.
ఇప్పటికే ట్రైలర్ వదిలిన తరవాత మూవీపై క్రేజ్ బాగా పెరిగింది. మరి జూలై 19న ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగితే, రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇది ఓ పండుగ లాంటిదే అని చెప్పొచ్చు.