పీ4 మార్గదర్శులకు తిరుమలేశుని దర్శనాలు!

రాష్ట్రంలోని నిరుపేదల జీవితాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు తన బుర్రలోంచి పుట్టిన పీ4 విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. పేదల జీవితాలు బాగుపడేందుకు, సమాజంలోని సంపన్నులు ఆర్థిక చేయూత అందించడం ద్వారా.. వారి జీవితాలు వికసించేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే.. ఆర్థిక సహాయం అందించే వదాన్యులను మార్గదర్శులు అని, సాయం పొందుతున్న వారిని బంగారు కుటుంబాలు అని వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మార్గదర్శులుగా ఎన్నారైలను ఆకర్షించడానికి, ఎన్నారై సంపన్నులతో రాష్ట్రంలో పేదల కుటుంబాలను ఆదుకునేలా చేయడానికి డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు ఒక సరికొత్త ప్రతిపాదన తెస్తున్నారు. మార్గదర్శులకు ప్రత్యుపకారంగా.. తిరుమల శ్రీవారి దర్శనాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన చెబుతున్నారు.

డిప్యూటీ స్పీకరు రఘరామక్రిష్ణ రాజు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఇంకా పలువురు ప్రముఖులు అమెరికాలో జరిగిన నాటా సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి పేదల అభ్యున్నతికి ప్రవేశ పెట్టిన పీ4 పథకాన్ని ఆదరించాలని, ఎన్నారైలు చేయూత అందించాలని కోరారు. అదే వేదికపై ఉన్న రఘురామక్రిష్ణ రాజు.. ఈ  పీ4 అనేది రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి జరుగుతున్న కృషి అని.. సీఎంతో మాట్లాడి కేబినెట్ నిర్ణయం తీసుకునేలాగా అడిగి, అలాంటి మార్గదర్శులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేలాగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

తిరుమలలో ప్రస్తుతం శ్రీవాణి పథకం ద్వారా పదివేల రూపాయలు చెల్లించిన వారికి స్వామి వారి వీఐపీ దర్శనభాగ్యం దక్కుతుంది. ఎన్నారైలు చాలా మంది భారత్ వచ్చినప్పుడు వీసా మీద దర్శనంతో పాటు, చాలామంది ఇలా శ్రీవాణి టికెట్లకు డబ్బు చెల్లించి భారత్ లోని తమ కుటుంబ సభ్యులతో సహా వీఐపీ దర్శనం పొందుతుంటారు. అలాంటివారు.. మరికొంద డబ్బు వెచ్చించగలిగితే.. పీ4 మార్గదర్శులుగా ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. వారి డబ్బుతో.. .రాష్ట్రంలోని కొన్ని పేదల జీవితాలు బాగుపడుతున్నాయనే తృప్తి దక్కుతుంది. పైగా శ్రీవారి దర్శనం కూడా దొరుకుతుందంటే.. ఈ పథకానికి ఇబ్బడిముబ్బడిగా ఆదరణ దక్కుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి రఘరామ ఐడియా.. పీ4 కార్యక్రమం మరింతగా విజయవంతం కావడానికి బాటలు వేస్తుందని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories