ఈ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రీతిలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే ప్రశ్నకు జవాబు.. పాఠశాలకు వెళ్లే పసిపిల్లవాడికి కూడా తెలుసు. కానీ.. జగన్ మామకు మాత్రం తెలియదు. ఆయనకు నిజంగానే అజ్ఞానం ఉన్నదో.. లేదా, అర్జంటుగా తమ పార్టీ అధికారంలోకి వచ్చేయాలనే ఆరాటం ఉన్నదో అర్థం కావడం లేదు. నెక్ట్స్ జరగబోయేవే జమిలి ఎన్నికలు అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వైఎస్ జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి కడపజిల్లాలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ డైలాగులు వేశారు.
నిజానికి ఈ దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం నిర్ణయం మాత్రమే తీసుకుంది. 2029 ఎన్నికల్లో ఈ పద్ధతి కార్యరూపంలోకి రాదు అని చాలా విస్పష్టంగా ప్రకటించారు. ఈలోగా అన్ని రాష్ట్రప్రభుత్వాల శాసనసభలకు జరిగే ఎన్నికలన్నింటినీ దారిలో పెట్టుకుని.. ఆతర్వాతి ఎన్నికలకు అంటే 2034 నాటికి జమిలి ఎన్నికలను అమల్లోకి తీసుకువస్తారు అని కేంద్రం అప్పుడే ప్రకటించింది.
కానీ వైఎస్సార్ సీపీ వారికి ఆత్రం ఆగడం లేదు. ఏదో సామెత చెప్పినట్టుగా.. ఆత్రగాడికి ఆకులో వడ్డించొచ్చు.. నాకు మాత్రం నేలనే వడ్డించు అన్నట్టుగా ఉంది వారి వ్యవహారం. జమిలి అనే పదం వినిపించడం మొదలైన దగ్గరనుంచి కొన్నాళ్లపాటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అజ్ఞానంతో మురిసిపోయారు. మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు వస్తున్నాయి. మన 2.0 ప్రభుత్వం ఏర్పడబోతోంది.. అని ఆయన అనేకమార్లు ప్రగల్భాలు పలికారు. ఆతర్వాత ఆయనకు జ్ఞానం వచ్చింది. జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అర్థమైంది. కానీ.. జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డికి ఇంకా అర్థమైనట్టు లేదు. ఆయన తన అజ్ఞానాన్ని అలాగే ప్రదర్శించుకుంటున్నారు.
త్వరలో రాబోతున్న జమిలి ఎన్నికల్లో వైకాపా విజయం ఖాయం. జగన్ 2.0 మొదలవుతుంది అని ఆయన అంటున్నారు. బహుశా ఆయన 2034 లో గెలుస్తాం అని అంటున్నారేమో.. 2029 ఎన్నికలను తెలుగుదేశం గెలుచుకుంటుందని ముందే వారికి అర్థమైందేమో అని కూడా జనం జోకులేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులందరికీ రప్పారప్పా సినిమా చూపించడం ప్రారంభిస్తారట. ప్రతి కార్యకర్త ఒక బుక్ తెరవాలట. ఆ బుక్ లో అందరి పేర్లు రాయాలట. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బుక్ లో ఉన్న అందరి పేర్లకు రప్పా రప్పా అయిపోతుందిట.
కార్యకర్తల్ల్లో ఎవరిపై ఎక్కువ కేసులు ఈ అయిదేళ్లలో నమోదు అయితే.. తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం అని రవీంద్రనాధరెడ్డి అంటున్నారు. మొత్తానికి జగన్ మేనమామ సగం అజ్ఞానంతోను, సగం అహంకారంతోను మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోది.