ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీయే కూటమిలో తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఇబ్బంది పడుతున్నట్టుగా ఎన్నడైనా సంకేతమాత్రంగానైనా చెప్పుకున్నదా? ఆ పార్టీ నాయకులు మాటల సందర్భంలోనైనా తమకు విలువ దక్కడంలేదనే అభిప్రాయాన్ని వెల్లడించారా? గత ఏడాది కాలంలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్ తొత్తులు తైనాతీలు మాత్రం భారతీయ జనతా పార్టీ మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. వారికోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు. బిజెపి రాష్ట్రంలో ఎప్పటికీ.. 5 శాతం రాజకీయ పార్టీగానే మిగిలిపోతుందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా వారికి న్యాయం జరగడం లేదని.. పురిగొల్పి వారిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏతావతా.. బిజెపి నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తించి.. కూటమి ఐక్యతకు బీటలు కొట్టాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏడాది గడుస్తున్నా సరే.. కూటమి పార్టీల బంధం దృఢంగా ఉండేసరికి వైసీపీ దళాలు ఓర్వలేకపోతున్నాయి. ఒకవైపు పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టడానికి, ఆయనకు అన్యాయం జరగుతున్నదని అనడం ద్వారా జనసేన కిందిస్థాయి కార్యకర్తలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలతో జనసేన కార్యకర్తలు తరచూ తగాదాలు పడేలా పరిస్థితులు పురిగొల్పడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే అవేమీ అంతగా వర్కవుట్ కావడం లేదు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న పవన్ కల్యాణ్ తన పార్టీ కిందిస్థాయి కార్యకర్తలకు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. కలిసే ఉండాలి.. చిన్న చిన్న తేడాలున్నా సర్దుకుపోవాలి అని అంటున్నారు.
ఇప్పుడు వైసీపీ దళాలు తమ ఫోకస్ ను భాజపా మీదికి మళ్లించాయి. ఆపార్టీ ఐదుశాతం పార్టీగానే ఎప్పటికీ మిగిలిపోతుందని.. చంద్రబాబు ఆ పార్టీని తొక్కేస్తారని రకరకాలుగా పురెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే సీట్ల విషయంలో అప్పటి పంపకాలు ఎలాగైనా జరిగి ఉండొచ్చు గానీ.. ఆ తర్వాత ఆ పార్టీకి దక్కుతున్న ప్రాధాన్యం వారు గమనించడం లేదు. ప్రస్తావించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటిదాకా దక్కిన రాజ్యసభ స్థానాలెన్ని? అందులో ఎవరెన్ని పంచుకున్నారు? భాజపాకు దక్కిన రాజ్యసభ ఎంపీ సీట్లెన్ని? మొత్తం సీట్లలో వాటి శాతమెంత? ఈ గణాంకాలు తీస్తే.. కూటమిలో భాజపాకు అత్యంత ప్రాధాన్యం ఏపీనుంచి దక్కుతున్నట్టుగా అర్థమవుతుంది. అయితే ఆ సత్యాలన్నీ దాచి, నామినేటెడ్ పదవులు, తదితర సంగతులు మాట్లాడుతూ బిజెపి వారి బుర్రలను విషతుల్యం చేయడానికి వైసీపీ నాయకులు, వారి తొత్తులైన మేధావులు తమ విశ్లేషణలు వండి వారుస్తున్నారు. అయితే.. బిజెపి నాయకులు వైసీపీ ఉచ్చులో పడకుండా.. కూటమి ఐక్యతను కాపాడడంలో సంయమనం వీడరాదని ప్రజలు కోరుకుంటున్నారు.