మూడున్నర వేల కోట్ల రూపాయల భారీ అవినీతికి ఆలవాలమైన లిక్కర్ కుంభకోణంలో నిందితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదే గానీ.. తగ్గడం లేదు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి బ్యాచ్ మొత్తాన్ని నిందితుల జాబితాలోకి చేర్చిన తరువాత.. తాజాగా మరో కీలక పాత్రధారి వెలుగులోకి వచ్చారు. వసూళ్ల నెట్వర్క్ కు కేంద్రబిందువు అయిన రాజ్ కెసిరెడ్డి కి ప్రధాన అనుచరుడు అయిన వరుణ్ పాత్రను పోలీసులు అధికారులు తాజాగా గుర్తించారు. ఈ కుంభకోణంలో నిందితుల జాబితాలో అతని పేరును కూడా చేర్చారు. దీంతో మొత్తం నిందితుల సంఖ్య 40కు చేరుకుంది. పురుషోత్తం అలియాస్ వరుణ్ ఈ కొత్త నిందితుడి పాత్ర వసూళ్లలో మాత్రమే కాదు.. లిక్కర్ కంపెనీలను గుప్పిట్లో పెట్టుకోవడంలో కూడా కీలకం అని అధికారులు గుర్తించారు.
తమాషా ఏంటంటే.. 2024లో కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే జాగ్రత్త పడిన వైసీపీ ప్రబుద్ధుల్లో ఈ వరుణ్ కూడా ఉన్నాడు. ఫలితాలు వెలువడిన వెంటనే.. వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ము కాసిన అనేక మంది.. ఎక్కడికక్కడ తట్టాబుట్టా సర్దుకుని పరారీలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది ఏకంగా విదేశాలకే వెళ్లిపోయారు. కొన్ని కీలక కేసుల్లో అప్పుడు పరారైన వారి ఆచూకీ ఇప్పటిదాకా తెలియడం లేదు కూడా. అదే తరహాలో ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ కూడా ముందే మేలుకున్నాడు. గత ఏడాది జులై ఆగస్టు నెలల్లోనే అతడు దేశం విడిచి పారిపోయాడని ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుని ఉన్నాడని గుర్తించారు.
ఇంజినీరింగ్ చదివి ఒక కాఫీషాప్ లో 32వేల నెల జీతానికి పనిచేస్తున్న వరుణ్ ను రాజ్ కెసిరెడ్డి బృందం లిక్కర్ కుంభకోణంలోకి తీసుకువచ్చింది. పుదుచ్చేరిలోని లీలా డిస్టిలరీస్ లో వరుణ్ ను ఏపీ ఆపరేషన్స్ హెడ్ గా నియమించారు. అతని ద్వారా వందల కోట్ల రూపాయలు ఆ కంపెనీ నుంచి ముడుపులు రాబట్టారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు దొరకడంతో సిట్ అధికారులు వరుణ్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు.
వరుణ్ ద్వారా రాజ్ కెసిరెడ్డి ఒక సరికొత్త దందాను నడిపించినట్టుగా విచారణలో వెలుగులోకి వచ్చింది. లీలా డిస్టిలరీస్ సంస్థకు సొంతంగా మద్యం తయారుచేసే మౌలిక సదుపాయాలు లేవు.
అయినా సరే వారితో ఏపీ బివరేజెస్ సంస్థ వ్యాపారం చేసింది. నాలుగేళ్లలో లీలా డిస్టిలరీస్ ఖాతాలోకి ఏకంగా 459 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి. వ్యవహారం కాస్త అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. మొత్తానికి అందులోకి వచ్చిన డబ్బులన్నీ వెంటవెంటనే వేర్వేరు కంపెనీల్లోకి మళ్లిపోయినట్టుగా గుర్తించారు. ఇదంతా కూడా వరుణ్ ద్వారా జరిగినట్టు తేల్చారు. తాజాగా వరుణ్ పేరును నిందితుల జాబితాలో చేర్చి దర్యాప్తు సాగిస్తున్నారు. వరుణ్ పేరిట ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఆయనను అమెరికానుంచి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.