జగన్ చేసిన ద్రోహాల్ని సరిదిద్దుతున్న సర్కార్! 

అసలే ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్రానికి ఒక అభివృద్ధి పని నిమిత్తం 26 వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సాయం అంటే ఎంతో అపురూపమైనది. ఏ ప్రభుత్వం కూడా అలాంటి అవకాశాన్ని చేజార్చుకోవాలని చూడదు. కానీ జగన్  మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరే వేరు. వారికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు. తమ వారికి దోచిపెట్టడం తప్ప మరొక లక్ష్యం ఉండదు. తాము దోచుకోవడానికి అవకాశం లేకపోతే.. అభివృద్ధి కోసం రాగల ఏ నిధుల మీద కూడా వారు దృష్టి పెట్టరు. అందుకే.. గత ప్రభుత్వ కాలంలో గ్రామాలలో మంచినీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన జలజీవన్ మిషన్ కోసం కేంద్రం కేటాయించిన 26వేల కోట్ల రూపాయలను తీసుకోకుండా మురిగిపోయేలా చేశారు. ఆ నిధులు రావాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకుండా ఆ పథకానికి, ఆ రూపేణా రాష్ట్రప్రజలకు జగన్ సర్కారు ద్రోహం చేసింది. అలాంటి అనేకానేక ద్రోహాలను చక్కదిద్దే క్రమంలో ఇప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. 

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల విలువైన జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. మార్కాపురం ప్రాంతంలో తాగునీటికి పడుతున్న ఇబ్బందుల గురించి.. తనకు నాలుగు దశాబ్దాల కిందటే  తెలుసునని అన్నారు. తాము కనిగిరిలో నివాసం ఉంటూ.. ఇక్కడి నీళ్లు ఫ్లోరైడ్ తో ఉంటాయని తెలిసి.. భయపడి ఆరునెలల్లోనే  వేరే ప్రాంతానికి వెళ్లిపోయాం అని గుర్తుచేసుకున్నారు.  ఇప్పుడు మొదటి విడతగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోనే భారీ ఎత్తున నిధులు ఖర్చుచేస్తున్నామని, దీనివల్ల ఐదు నియోజకవర్గాల్లోని పదిలక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. 

2019–24 మధ్యకాలంలో ఈ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి 26వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే, కేవలం నాలుగువేల కోట్లతో పైపులు మాత్రం వేసి వదిలేశారని పవన్ చెప్పుకొచ్చారు. నిధులు మొత్తం మురిగిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తాను, చంద్రబాబునాయుడు  ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో ప్రకాశంతోపాటు అనంతపురం, పల్నాడు, శ్రీకాకుళం ప్రాంతాలకు నీరందించేందుకు 86 వేల కోట్లు అవసరమౌతాయని విన్నవించి ఆమోదం పొందినట్లు చెప్పారు. కూటమి తరఫున ఎమ్మెల్యేలు కూడా పెద్ద సంఖ్యలో గెలిచినందువల్లనే ఇది సాధ్యమవుతున్నదని చెప్పుకొచ్చారు. మొత్తానికి పాతప్రభుత్వం చేసిన నష్టాలను కూటమి సర్కారు చక్కబెడుతున్నదని ప్రజలు హర్షిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories