గురివింద గింజ ఎదుటి గింజల వీపు మీద ఉన్న నలుపు రంగు చూసి పగలబడి నవ్వుతుందిట. కానీ తన వీపు మీద కూడా అలాగే నలుపు రంగు ఉంటుందనే సంగతి అది చూసుకోదట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గురివింద గింజ నీతిని మించిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం పాలనలో డిప్యూటీ ముఖ్యమంత్రికి అసలు పరిపాలనలో భాగం ఉందా? అని అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఏకంగా నలుగురు డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని మెయింటైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. వారికి ఇచ్చిన ప్రాధాన్యం ఎంతనో ఆయన చాలా కన్వీనియెంట్ గా మరచిపోతున్నారు.చూడబోతే.. ఏడాది పరిపాలన గడుస్తున్నప్పటికీ.. ఎన్డీయే కూటమి పార్టీలు చెక్కుచెదరని ఐక్యతతో ఉండడం.. వారి మధ్య కంచిత్తు కూడా విభేదాలు రాకపోవడం వైసీపీ వారికి చాలా బాధగా ఉన్నట్టుంది.
అందుకే పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టి, గిల్లి.. కూటమి మీద అసంతృప్తి ఏర్పడేలా చూడాలనే కుటిలత్వానికి వెళుతున్నారు. ప్రస్తుతం మూడు పార్టీల మధ్య కూడా సయోధ్య ఉంది. భాజపా కు కొత్త సారధి వచ్చిన తర్వాత కూడా కూటమి ఎజెండాను కార్యరూపంలోకి తెస్తూనే తమ సొంత పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. బిజెపిలోనూ ఉన్న వైసీపీ కోవర్టులు.. అక్కడి నాయకత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ పన్నాగాలు ఫలించడం లేదు. తాజాగా కూటమిలో చిచ్చు పెట్టడానికి అంబటి తయారయ్యారు.
డిప్యూటీసీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ కు హెలికాప్టర్ లో సీటు, స్పెషల్ ఫ్లైటు తప్ప ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు వైఎస్ జగన్ హయాంలో డిప్యూటీ ముఖ్యమంత్రులకు ఎంత భాగస్వామ్యం ఉండేదో ముందుగా గమనించుకోవాలని ప్రజలు అంటున్నారు. జగన్ కేవలం కులాల కొలబద్ధల మీద నలుగురు డిప్యూటీలను పెట్టుకున్నారు. ఆ అయిదేళ్లపాటు డిప్యూటీ ముఖ్యమంత్రి అని విజిటింగ్ కార్డు వేసుకోవడానికి తప్ప.. వారికి ఆ పదవి మరెందుకూ పనికి రాలేదంటే అతిశయోక్తి కాదు. డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి..
ఆ పదవి గురించి, జరుగుతున్న అవమానాల గురించి ఎన్ని సార్లు బహిరంగంగా విలపించాడో లెక్కలేదు. ఈ రెడ్లతో మనం పడలేం.. మన వల్ల కాదు.. అంటూ తన నియోజకవర్గంలో కూడా తన మాటకు విలువలేకుండా చేసేస్తున్న స్థానిక వైసీపీ నేతల గురించి ఆయన వాపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి అనే పదానికి ఏమాత్రం విలువలేకుండా చేసేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆ చరిత్రనంతా మర్చిపోయి తగుదునమ్మా అంటూ అంబటి రాంబాబు వచ్చి ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రికి దక్కుతున్న ప్రాధాన్యం గురించి మాట్లాడడం చూసి జనం నవ్వుకుంటున్నారు.