వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఎంతటి దురహంకారంతో వ్యవహరించారో, ప్రజలంటే ఎంతటి చులకన భావంతో ఉండేవారో ఇప్పుడు ఒకసారి పునశ్చరణ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం ఒక ప్రజా కార్కక్రమానికి పిలుపు ఇచ్చినప్పుడు.. స్వయంగా ప్రభుత్వాధినేత ఆ కార్యక్రమంలో పాల్గొనకపోతే కామెడీగా ఉంటుంది. దానిమీద ఆయనకే గౌరవం లేదని అర్థమవుతుంది. ఇలాంటి సరైన పద్ధతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చూసి.. జగన్ నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు పనితీరు చూస్తే.. జగన్ అహంకారం కొంతయినా తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు.
విషయం ఏంటంటే.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట కార్యక్రమం నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఈ ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలను చాటి చెప్పాలని, నెరవేర్చిన హామీల గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు నిర్దేశించారు.
ఒకసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. మళ్లీ అయిదేళ్ల పాటు నాయకులు.. ప్రజలకు కనిపించడం అనేదే అరుదు అనే మాటలు తరచుగా వినిపించే రోజుల్లో ఒక్కొక్క ఏడాది పూర్తికాగానే.. నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటూ ఉండాలని, చేసిన పనులను నివేదిస్తూ ఉండాలని నిర్దేశించడం చాలా మంచి పరిణామం. జగన్ ఇలాంటి పని నాలుగేళ్ల పాలన తర్వాత ప్లాన్ చేశారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ప్రతి ఇంటికీ మేం ఇన్ని వేల, లక్షల రూపాయలు ఇచ్చాం అని డప్పు కొట్టుకోవడానికి వాడుకున్నారు. కానీ.. చంద్రబాబునాయుడు తొలి ఏడాదిలో ప్లాన్ చేయడం అంటే.. ప్రజలకు నిజంగా ఎదురవుతున్న కష్టాలను కూడా నాయకులు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆలోచించడం కుదురుతుంది. అలా ఈ మంచి ఆలోచనను అమల్లో పెట్టారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లాలి అన్నారు గనుక.. తన తీవ్రమైన పనుల ఒత్తిడి షెడ్యూళ్లలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుప్పం నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడి గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకం అయ్యారు. జగన్ అయిదేళ్ల చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. ఆయన గడపగడపకు ప్రభుత్వం రోజుల్లో కూడా జగన్ స్వయంగా పులివెందుల నియోజకవర్గానికి వెళ్లలేదు. అక్కడ తిరిగే బాధ్యత వేరే వారికి అప్పగించారు. ప్రజలంటే తన చులకన భావాన్ని చాటుకున్నారు. కానీ ప్రజలే దేవుళ్లు అని నమ్మే తీరును జగన్- చంద్రబాబును చూసి నేర్చుకోవాలని ప్రజలు అంటున్నారు.
చంద్రబాబు జులై 1 న తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని వచ్చారు. విరామం, విశ్రాంతి కూడా లేకుండా 2వ తేదీ మళ్లీ కుప్పం వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజలకోసం పరితపిస్తూ కష్టపడే ఆయన తత్వం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.