మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేపదే తన 2.0 ప్రభుత్వం గురించి ఊదరగొడుతూ ఉంటారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చి.. కూటమి పార్టీ నాయకులందరి భరతం పడతానని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వానికి సహకరిస్తున్న అధికారులు ఎవరైతే ఉంటున్నారో.. వారందరినీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తానని వ్యాఖ్యానిస్తుంటారు. పోలీసు అధికారుల్ని బట్టలిప్పదీయించి కొడతానని కూడా హెచ్చరిస్తుంటారు. పాపం.. జగన్మోహన్ రెడ్డి.. 2.0 పేరు పెడుతూ.. తాను మళ్లీ అధికారంలోకి వస్తానని నమ్మించే ప్రయత్నం చేస్తూ.. పార్టీని కాపాడుకోవడానికి, పార్టీనుంచి ఎవ్వరూ పారిపోకుండా కాపాడుకోవడానికి ఇలా కష్టపడుతుంటారు. ఆయన ఇలాంటి మాయ మాటలు.. పార్టీ నాయకులకు ఏమేరకు నమ్మకం కలిగిస్తున్నాయో తెలియదు.. కానీ.. జగన్ ని నమ్ముకుని, ఆయనకు కొమ్ము కాస్తూ బతికిన అధికార్లకు మాత్రం ఎలాంటి నమ్మకం కలగడం లేదు. జగన్ మళ్లీ వస్తాడని ఎదురుచూడడం కంటె తమ దారి తాము చూసుకోవడం బెటర్ అని అంతా అనుకుంటున్నట్టు కనిపిస్తోంది.
జగన్ ప్రభుత్వ కాలంలో ఆయన ప్రభుత్వానికి కొమ్ము కాసిన, జగన్ అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం వారిని వేధించడానికి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఆయన గతంలో కడపజిల్లా ఎస్పీతో పాటు, పలు కీలక పోస్టులు నిర్వహించారు. జగన్ దళాలకు నిత్యం అండగా ఉన్నారు. వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జగన్ ప్రభుత్వానికి సహకరించడంలో హద్దులు మీరి ప్రవర్తించారనే ఆరోపణలున్నాయి.
సహజంగానే ఇంతటి వివాదాస్పద అధికార్లను కొత్త ప్రభుత్వం పక్కన పెట్టింది. నిజానికి చాలా మంది అధికార్లకు వీఆర్ మాత్రమే ప్రాప్తం కాగా, సిద్ధార్థ్ కౌశల్ కు కనీసం డీజీపీ ఆఫీసులో అ్డడ్మిన్ బాధ్యతలు అప్పగించారు.
అయితే సాధారణంగా ఏం జరుగుతుందంటే.. ఇలా లూప్ లైన్లోకి వెళ్లిన అధికారులు.. అయిదేళ్ల పాటు వేచి చూస్తుంటారు. తాము ఒక పార్టీకి క్లోజ్ గనుక.. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ వైభవం నడుస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ సిద్ధార్థ్ కౌశల్ కు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం సడలిపోయినట్టుగా కకనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం పరిపాలన సజావుగా, జనరంజకంగా, అభివృద్ధి ప్రధానంగా సాగుతున్న తీరు గమనిస్తే.. ఇక ఎప్పటికీ వారే మళ్లీ గెలుస్తుంటారని సిద్ధార్థ్ కౌశల్ కు అర్థమైనట్టుంది. ఐఐఎం గ్రాడ్యుయేట్ అయి, తర్వాత ఐపీఎస్ కు వచ్చిన ఈ మేధావి అధికారి రాబోయే కాలంలో జరిగే పరిణామాలను సులువుగా ఊహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ 2.0 ఎప్పటికీ జరగదని, అందువల్ల ఆయన భజన చేస్తూ అయిదేళ్లు బతికినందుకు తాను ఎప్పటికీ లూప్ లైన్లో మగ్గవలసిందేనని ఆయనకు అర్థమైనట్టుంది. అందుకే రాజీనామా చేసేసి కార్పొరేట్ రంగంలోకి వెళ్లదలచుకున్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు. జగన్ 2.0 వస్తుందని ఆయన మనుషులకే నమ్మకం కలగలేదని వ్యాఖ్యానిస్తున్నారు.