అయిదేళ్ల పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన పాపాలు ఇంకా చాలా చాలా పెద్దవే అయినప్పటికీ.. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 140 రోజుల జైలు జీవితం తర్వాత బెయిలు లభించింది. ఆయన మీద ఉన్న నేరారోపణలు చాలా తీవ్రమైనవే అయినప్పటికీ.. తనకు ఆరోగ్యం ఘోరంగా తయారైనదని, భోజనం పడడం లేదని, చిక్కిపోయానని, బరువు తగ్గానని రకరకాల కారణాలు చూపించి మొత్తానికి వల్లభనేని వంశీ తన మీద ప్రస్తుతం విచారణలో ఉన్న అన్ని కేసుల్లోనూ బెయిలు తెచ్చుకోగలిగారు. జైలునుంచి బయటకు వచ్చారు. కానీ వంశీ శిబిరంలో మాత్రం ఈ బెయిలు మూణ్నాళ్ల ముచ్చటే అవుతుందేమోనని, రెండు మూడు రోజులు ఇంటి భోజనం తిని.. మళ్లీ జైలుకు వెళ్లక తప్పదేమోనని భయం కలుగుతోంది. ప్రభుత్వం వంశీకి హైకోర్టులో దక్కిన బెయిలు పిటిషన్లను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ నడుపుతుండడమే అందుకు కారణం.
సాధారణంగా ఏ కేసులో అయినా సరే.. రిమాండులో ఉన్న నిందితులు బెయిలు అడిగినప్పుడు.. పోలీసులు చెప్పే కారణాలు ఒక్కటే. నిందితులు బలమైన వారు గనుక, కేసు విచారణ జరుగుతుండగా వారు జైలునుంచి బయటకు వస్తే.. సాక్షులను ప్రభావితం చేస్తారని.. కేసును తప్పుదారి పట్టిస్తారని, బెదిరిస్తారని అందువల్ల బెయిలు ఇవ్వరాదని వాదిస్తారు. నిజానికి ఈ ఆరోపణలు ఆ నాయకుల గురించి ఒక అంచనాతో మాత్రమే చేస్తారు. కానీ.. ఇక్కడ తమాషా ఏంటంటే.. వంశీ మీద ప్రాథమికంగా నమోదు అయినదే.. సాక్షులను కిడ్నాప్ చేసి.. కేసును మాయచేయడానికి ప్రయత్నించిన నేరమే. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద తన గూండాలతో దాడి చేయించి.. ఆ కేసు పెట్టిన పార్టీ ఆఫీసు ఉద్యోగి అయిన దళితుడిని కిడ్నాపు చేయించి.. ఆ కేసులో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించిన చరిత్ర వల్లభనేని వంశీది. అలాంటి వ్యక్తి ఒకసారి అరెస్టు అయిన తర్వాత.. గతంలో ఆయన పాపాలకు, దందాలకు బలైన వారంతా పోలీసులను ఆశ్రయించారు. రకరకాల వివిధ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదు అవుతూనే ఉండడంతో ఆయన కంటిన్యువస్ గా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బెయిలుపై బయటకు వచ్చారు.
అలాంటి వ్యక్తికి బెయిలు ఇస్తే మళ్లీ సాక్షులను బెదిరించే, కేసులను ప్రభావితం చేసే తన దుశ్చర్యలను మళ్లీ కొనసాగిస్తారంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. అక్రమ మైనింగ్ కు సంబంధించి దాదాపు 196 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన కేసులో వంశీకి బెయిలు ఇవ్వడం మంచిది కాదని, దానిని రద్దు చేయాలని సిద్ధార్థ లూథ్రా సుప్రీంలో వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ నివేదికను తమకు సీల్డుకవర్లో పంపాలని చెప్పిన న్యాయస్థానం కేసును 17వ తేదీకి వాయిదా వేసింది. సో, వంశీకి బెయిలు ముచ్చట 17వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని ఆ తర్వాత బెయిలు రద్దుకాగానే.. ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.