పది లక్షలతో పాపాలు కడిగేసుకుంటారా జగన్!

జగన్మోహన్ రెడ్డి తన పాపాలను కడిగేసుకునే ప్రయత్నం చేశారు. డబ్బు కుమ్మరిస్తే చాలు ఎలాంటి పాపాలు అయినా కడిగేసుకోవచ్చునని జగన్ నమ్ముతారని మరోసారి తేలింది. తన దురహంకారంతో నిర్వహించిన అనధికారిక ర్యాలీ కారణంగా.. పేద దళిత వృద్ధ కార్యకర్తను బలితీసుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఆయన ప్రాణానికి వెలకట్టారు. ఆయన మరణానికి తానే స్వయంగా కారణంగా మారి, ఇప్పుడు ఆయన కుటుంబాన్ని పిలిచి.. వారి చేతిలో డబ్బు పెట్టి, వారి నోర్లను మూయించే ప్రయత్నం చేస్తున్నట్టుగా పలువురు భావిస్తున్నారు. చీలి సింగయ్య భార్య లూర్థు మేరిని ఇతర కుటుంబసభ్యులను తాడేపల్లిలోని ప్యాలెస్ కు పిలిపించుకుని ఆమెకు పదిలక్షల రూపాయలు ఇచ్చి, తన పాపాన్ని కడిగేసుకోవాలని జగన్ ప్రయత్నించడం చిత్రంగా కనిపిస్తోంది.

రెంటపాళ్లలో మరణించిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఎంతటి హంగామా సృష్టించారో అందరికీ తెలుసు. పోలీసులు పరిమితంగా జనాన్ని వెటవేసుకుని వెళ్లడానికి అనుమతులు ఇస్తే.. ఆ ఆదేశాలను ధిక్కరించడమూ పోలీసులను, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం మాత్రమే తన లక్ష్యం అన్నట్టుగా జగన్ వ్యవహరించారు. తన ఇంటినుంచి దారిపొడవునా ర్యాలీగా వందల కార్లను వెంటేసుకుని.. వేలమందిని పోగేయించి రోడ్ల మీద ఎగబడేలా ప్రేరేపించి ఈ యాత్ర నిర్వహించారు. కిరాయికి తెచ్చుకున్న జనాలతో.. తన పట్ల ప్రజల్లో ఆదరణ వెల్లువలా వస్తోందనే భ్రమ కల్పించడానికి ఆయన ప్రయత్నించారు. మొత్తానికి ఆయన పర్యటనలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు కిందనే చీలి సింగయ్య పడి మరణించడం జరిగింది.

జగన్ కనీసం మానవత్వం చూపించలేదు. పార్టీ వారు సింగయ్యను పక్కకు లాగిపడేసి వెళ్లిపోయారు. జగన్ కారు  ఆపి పరామర్శించలేదు. మరణం తర్వాత కూడా ఇన్నాళ్లుగా వారి కుటుంబం గురించి అనుకోలేదు. తనమీద తప్పుడు వీడియోలు విడుదల చేశారంటూ.. తప్పుడు ప్రచారంతో తనను తాను కాపాడుకోవడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కేసు కొట్టేయాలని కోర్టుకెక్కారు. అందుకు కోర్టు అనుమతించకపోయినా.. ఆయన మీద తదుపరి విచారణ నిలిపివేయాలని ఆదేశించిన తర్వాత.. తన తాడేపల్లి ప్యాలెస్ కు లూర్థుమేరిని పిలిపించుకుని ఆమె చేతిలో పదిలక్షలరూపాయలు పెట్టి.. తన పాపాల్ని కడిగేసుకోవచ్చునని జగన్ భావించడం ప్రజల దృష్టిలో ఈసడింపునకు గురవుతోంది.

సింగయ్య ప్రాణాలకు పదిలక్షలతో వెలకడితే ఆయన పాపం ప్రక్షాళన కాదని.. కోర్టు కల్పించిన ఊరట శాశ్వతం కాదని.. సింగయ్య మరణం వెనుక జగన్ నిర్లక్ష్యం పాత్ర ఎంత ఉన్నదో  మొత్తం లెక్క తేలవలసిందేనని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories