చెప్పుకోడానికి ఏదో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తనకి ఉన్నది కదాని.. వైఎస్ షర్మిల విపరీతంగా కష్టపడిపోతున్నారు. ఆ పార్టీని బలోపేతం చేయగలననే నమ్మకం ఆమెకు ఉన్నదో లేదో గానీ.. అందుకు చాలా చాలా కష్టపడుతున్నారు. ఊరూరా తిరిగి మీటింగులు పెడుతున్న షర్మిల.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి కోట్ల సంఖ్యలో ప్రజాబలం ఉన్నది గానీ.. క్షేత్రస్థాయిలో నాయకత్వ లేమి ఉన్నదని.. పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉన్నవారు వచ్చి తమ పార్టీలో చేరితే.. భవిష్యత్తులో వారిని ఎమ్మెల్యేలు చేస్తామని అంటున్నారు. చివరి నిమిషంలో వచ్చి టికెట్లు అడిగితే ఉపయోగం లేదని, ఇప్పటినుంచి పార్టీలోకి వచ్చి కష్టపడాలని అంటున్నారు.
నిజానికి షర్మిల మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. అమాయకంగా కూడా కనిపిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె మరీ ఇంత అమాయకంగా ఎలా మాట్లాడగలుగుతున్నారా? అనేది చర్చనీయాంశంగానే ఉంది. ఎందుకంటే.. కాంగ్రెసు పార్టీ ఈ రాష్ట్రంలో మళ్లీ బతికి బట్టకట్టే పరిస్థితి ఇవాళ్టి వాతావరణంలో లేదన్నది స్పష్టం. భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నవారు వచ్చి తమ పార్టీలో చేరాలని ఆమె పిలుపు ఇచ్చినంత మాత్రాన ఎవరు వస్తారు? కొత్తగా నాయకులు ఎదగాలని అనుకుంటున్న వారు అసలు కాంగ్రెస్ వైపు దృష్టి సారించే అవకాశం ఉన్నదా? అనేది ప్రజల సందేహం. దానికి బదులుగా.. షర్మిల ఘర్ వాపసీపై దృష్టి పెడితే కొంత ప్రయోజనం ఉంటుందేమోనని పలువురు భావిస్తున్నారు.
జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత.. అందులోకి వలసవెళ్లిన నాయకులు 90 శాతానికి పైగా కాంగ్రెస్ వారే. అంటే కాంగ్రెస్ నాయకుల బలం మొత్తం ఇప్పుడు వైసీపీలో ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ చెప్పుకోడానికి 11 సీట్లు గెలిచింది తప్ప.. భవిష్యత్తు కోణంలో చూసినప్పుడు కాంగ్రెస్ కు, వైఎస్సార్ కాంగ్రెస్ కు పెద్ద తేడా ఏం లేదు. జగన్ పార్టీని నడుపుతున్న తీరుతో ఆ పార్టీలో మిగిలిఉన్నవారు కూడా విసిగిపోయి ఉన్నారు. ఈవాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. షర్మిల వైసీపీలోని మాజీ కాంగ్రెస్ నాయకులకు ఆఫర్లు ప్రకటిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అక్కడ గతిలేక కొనసాగుతున్న నాయకులు అనేకమంది ఉన్నారు. వారిని కాంగ్రెస్ ఆకర్షించగలిగితే.. ఆ పార్టీ బలపడుతుంది. పైగా వైసీపీ అదికారంలో ఉన్న రోజుల్లో అంతో ఇంతో వందల కోట్లు దోచుకున్నవారే అందరూ కాబట్టి.. కాంగ్రెసులోకి వచ్చినా సరే.. డబ్బు ఖర్చు పెట్టి పార్టీ ఆదరణ పెంచడానికి పనిచేస్తారు. అలా కాకుండా.. కొత్త నాయకత్వం వచ్చి తమ పార్టీలో చేరాలని షర్మిల కోరినంత మాత్రాన ఫలితం ఉండదనే వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
అయినా రాష్ట్రమంతా పార్టీని ఉద్ధరిస్తానని తిరుగుతున్న షర్మిల.. తన సొంత జిల్లా, సొంతనియోజకవర్గంలో మళ్లీ పోటీచేస్తే గతంలో కంటె ఎక్కవ ఓట్లు సంపాదించుకునే స్థాయిలో పనిచేస్తున్నారా.. అక్కడైనా పార్టీని బలోపేతం చేశారా అనేది చెక్ చేసుకోవాలని పలువురు హితవు చెబుతున్నారు.