జగన్మోహన్ రెడ్డిది ఎంతటి అమానవీయమైన వైఖరి అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసి వస్తోంది. స్వయంగా తన వాహనం కింద పడిన ఒక వృద్ధుడి తలమీదనుంచి తాను ప్రయాణిస్తున్న కారు చక్రం ఎక్కి.. అతడు అత్యంత తీవ్రంగా గాయపడితే.. కనీసం పట్టించుకోకుండా ప్రజలకు అభివాదాలు చేసుకుంటూ వెళ్లిపోయిన దుర్మార్గమైన నైజం వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. తన కారు కింద ఒక ముసలివాడిని, తనను అభిమానించే పార్టీ కార్యకర్తను తొక్కించేసి, పైగా అది తన కారు కాదన్నట్టుగా.. కాన్వాయ్ లోని ఎవరిదో కారు తగిలి ప్రమాదం జరిగిందే తప్ప.. అందులో పెద్ద తప్పేమీ లేదన్నట్టుగా అంబటి రాంబాబు తో ప్రెస్ మీట్ పెట్టించి.. తప్పుడు మాటలు మాట్లాడించడం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశం అవుతోంది.
ఏడాది కిందట చచ్చిపోయిన తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించాలి అని బయల్దేరి జాతర ఊరేగింపులాగా డీజేలతో, డ్యాన్సులతో పూలు చల్లించుకుంటూ అభివాదాలు చేస్తూ అత్యంత అసహ్యకరమైన రీతిలో వైఎస్ జగన్ సాగించిన రెంటపాళ్ల యాత్ర ఇప్పుడు ఆయన మెడకు హత్యానేరంగా చుట్టుకోబోతోంది.
సింగయ్య మరణం ఎలా సంభవించిందో చాలా స్పష్టంగా చూపించే కొత్త వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఆయన ఎవరి వాహనం కింద పడి నలిగిపోయాడో తెలియక, గుర్తు తెలియని వాహనం అన్నట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలను గమనిస్తే.. జగన్ ప్రయాణిస్తున్న కారు కిందనే సింగయ్య పడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు జగన్ అభిమానులు చేతిలో ఫ్లెక్సిలతో కారు బాయ్ నెట్ మీదికి ఎక్కి.. ఆయనకు అభివాదాలు చేస్తుండగా.. జగన్ అందరికీ చేయి అందిస్తూ ఉండడంతో.. ఆయనతో కరచాలనం చేయడానికి జనం వేలం వెర్రిగా వాహనం మీదికి ఎగబడుతూ ఉండగా.. సింగయ్య జగన్ కారు ముందు చక్రా కిందనే పడిపోయాడు.
జగన్ కారుకు ఎడమవైపు ఫ్రంట్ సీటు నుంచి నిల్చుని అందరికీ చేతులు అందిస్తూ ఉన్నాడు. కుడివైపు ముందు చక్రం కింద సింగయ్య పడిపోగా..అతడి తలని కొద్దిదూరం యీడ్చుకుంటూ వెళ్లి.. తొక్కించుకుంటూ జగన్ కారు ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఆదివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి.. ‘ప్రమాదంలో మనిషి చనిపోతే.. దానిని బలి అంటారా?’ అంటూ నాటకీయంగా రాగాలు తీసి ప్రశ్నించిన కొంత సేపటికే ఈ వీడియో విడుదల అయింది. చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఈ వీడియో ఆధారాన్ని నకిలీది అని దుష్ప్రచారం చేయడానికి జగన్ కొమ్ముకాసే నీలిదళాలు అప్పుడే రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తోంది.