సజ్జల కూడా అరెస్టుకు సిద్ధం కావాల్సిందే!

అమరావతి మహిళలను గురించి అసభ్య, వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వ్యవహారాలలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి! తుళ్లూరులో అమరావతికి చెందిన మహిళా రైతులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు, వివిఆర్ కృష్ణంరాజు వ్యాఖ్యలతోనే మనోవేదనకు గురై బాధపడుతున్న తమను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి అసభ్యంగా మాట్లాడడం మరింతగా భాధించిందని వాపోయారు. కేసు రిజిస్టరు అయింది. నేడోరేపో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకాలంలో జరిగిన అనేకానేక అరాచకాలకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఇప్పటికే బోలెడు కేసులు ఉన్నాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడి, విధ్వంసం కేసుకి సంబంధించిన కూడా ప్రధాన సూత్రధారిగా పార్టీ గూండాలను రెచ్చగొట్టి పంపించిన వ్యక్తిగా సజ్జల మీద ఫిర్యాదులు  ఉన్నాయి.

ఈ కేసులలో నోటీసులు అందుకొని సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు కూడా. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ ఆ పార్టీ నాయకులకు అలవాటైన సమాధానం మాత్రమే ఆయన చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంత తేలికైనది కాదు. ముందస్తు బెయిలు తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. వివిఆర్ కృష్ణంరాజు ‘అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ నీచమైన వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు మురిసిపోతూ చర్చా కార్యక్రమానికి ప్రయోక్తగా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని మరింత ప్రోత్సహించడం.. వారి వ్యవహారం రాష్ట్రంలో ఎంత మేర అగ్గి రాజేసిందో అందరికీ తెలుసు. ఆ తర్వాతి పరిణామాలలో నిరసనలు తెలియజేస్తున్న వారి మీద నిందలు వేయడం కోసం మీడియా ముందుకు వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి.. అలాంటి ఆందోళనకారులందరూ కూడా సంకర తెగకు చెందినవారు అంటూ మరింత నీచమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులు మరింత ఆగ్రహించడానికి మరింత మనోవేదనకు గురికావడానికి ఆయన కారణం అయ్యారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష మరికొందరితో కలిసి తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొమ్మినేని అరెస్టు చేయడానికి దారి తీసిన కేసు కూడా ఆమె పెట్టినదే కావడం గమనార్హం. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేయబోతున్నారని అర్థమవుతోంది. పాత కేసులలో ముందస్తు బెయిళ్లు, అరెస్టు నుంచి రక్షణ లాంటి న్యాయపరమైన అవకాశాలు వాడుకున్న సజ్జల ఇప్పుడు ఏం చేస్తారో వేచిచూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories