పోలీసులను దోషులుగా చిత్రీకరించడానికి, వారి మీద నిందలు వేస్తూ గడపడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు రకరకాల కొత్త ఎత్తుగడలు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీలు.. తప్పు తమ వైపు ఉన్నప్పటికీ కూడా.. పోలీసుల మీద రెచ్చిపోవడం అనేది వరుస సంఘటనల్లో వారి అలవాటులాగా కనిపిస్తుండడంతో.. వీరందరికీ కామన్ గా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకే రకమైన ఆదేశాలు అందుతున్నాయేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. అలాలేకుంటే.. అందరూ ఒకే తరహాలో ఎందుకు పోలీసుల మీద ఎగిరెగిరి పడుతుంటారు? అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఓ భూ ఆక్రమణ వ్యవహారం గొడవ అయింది. అయిదేళ్లపాటు తమకు అలవాటు అయిపోయిన కబ్జాలు, దురాక్రమణల ఎపిసోడ్ లను వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. గరుడభద్ర అనే గ్రామంలో గ్రామకంఠం భూమిని వారు ఆక్రమించుకుని షెడ్లు వేయడానికి ప్రయత్నించారు. వీరి ఆక్రమణల ప్రయత్నాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. వైసీపీ నాయకులు ఒక్కసారిగా రెచ్చిపోయి దుడ్డుకర్రలతో గ్రామస్తుల మీద విరుచుకుపడి చితక్కొట్టారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో వజ్రపుకొత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అవకాశం దొరికింది కదా అనుకున్నారేమో.. జగన్ దళంలోని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులందరినీ వెంటబెట్టుకుని పోలీసు స్టేషన్ మీదకు వచ్చి పడ్డారు. సీఐని నానా దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. ‘ఏమనుకుంటున్నావు.. నువ్వెంత నీ పదవెంత’ అంటూ వీరంగం వేశారు. పోలీసులు ఆయనకు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా సీదిరి తగ్గలేదు. సీదిరి దుర్మార్గపు ప్రవర్తన ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశం అవుతోంది.
అధికారుల మీద రెచ్చిపోవడం గతంలో ఆయనకు మామూలే. ఎన్నికల సమయంలో కూడా అధికార్ల మీదరెచ్చిపోయి వివాదాస్పదం అయ్యారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన దురహంకారం ఏమాత్రం తగ్గినట్టు లేదు. ఇటీవలే మాజీ మంత్రి విడదల రజని సీఐ మీద రెచ్చిపోయారు. నేరస్తుడిని తన కారులో ప్రొటెక్ట్ చేసి తీసుకువెళుతూ.. అప్పగించమని అడిగిన పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు.. కబ్జాకోరుల్ని సమర్థించడానికి స్టేషనుకు వచ్చి నానా యాగీ చేశారు. చూడబోతే.. తమ పార్టీ మాజీలందరికీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకటే ఇన్ స్ట్రక్షన్స్ వచ్చినట్టుగా, పోలీసుల మీద రెచ్చిపోతూ రాద్ధాంతం చేయమని సూచించినట్లుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.