జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎలా జరిగాయో యావత్ ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉంటే ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహరించగలరో.. అన్ని వ్యవస్థలను తన ఇనుప పాదాల కింద ఎంత ఘోరంగా తొక్కిపట్టగలరో.. తొలిసారిగా ప్రజలకు తెలిసివచ్చింది ఆ ఎన్నికల సమయంలోనే. నియంతృత్వ పాలనలో ప్రహసనప్రాయంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించడానికి తీసుకుంటున్న పారదర్శక పద్ధతులను చూసిన నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాంటి అరాచకాలకు ఆస్కారం లేకుండా ఆన్ లైన్ లోనే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక ప్రక్రియలను పూర్తిచేసుకునేలా సరికొత్త విధానం అమల్లోకి తేనున్నారు.
జగన్ పాలనకాలంలో స్థానిక ఎన్నికల్లో తన ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు అసలు నామినేషన్లే వేయకుండా జగన్ దళాలు అడ్డుకున్నాయి. దాదాగిరీ చేశాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎవ్వరూ నామినేషన్ కూడా వేయలేకపోయారు. పార్టీ గూండాలు దాడులు చేయడం ఒక ఎత్తు అయితే.. పోలీసులనే తమ తొత్తుల్లాగా వాడుకుంటూ వారి ద్వారా ప్రత్యర్థి పార్టీల వారి నామినేషన్లను అడ్డుకోవడం, వారిని నిర్బంధించి నామినేషన్ గడువుపూర్తయ్యేదాక వేయకుండా చేయడం లాంటి అరాచకాలకు లెక్కేలేదు. అనేక చోట్ల ఇతర పార్టీల వారు గెలిచినా కూడా భయపెట్టి, బెదిరించి తమ పార్టీ కండువా కప్పి.. తమ అభ్యర్థులే గెలిచినట్టుగా ప్రకటించుకున్న చరిత్ర వారిది. అసలు ఎవ్వరినీ నామినేషన్లే వేయనివ్వకుండా చేయడం వారి దుర్మార్గపు శైలికి పరాకాష్ట.
ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. పూర్తి పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేయడం కూడా ఆన్ లైన్ లోనే చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో.. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారుచేయిస్తున్నారు. ఓటర్ల జాబితాలు, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల ఫలితాలు అన్నిదశల్లోనూ ఎలక్ట్రానిక్ సేవలు వాడుకోనున్నారు.
నామినేషన్ వేయదలచుకున్న వారు ఎవ్వరికీ భయపడకుండా ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో నామినేషన్ వేసేయవచ్చు. ఆ తర్వాత ఆ ప్రింట్ అవుట్ ను నిర్ణీత గడువులోగా అధికారికి అప్పగిస్తే సరిపోతుంది. ప్రత్యర్థులు అడ్డుకుంటారనే భయం లేదు. ఇలాంటి పారదర్శక పద్ధతులను జగన్ నేర్చుకోవాలని.. ఆయన పార్టీకి నిజంగా సత్తా ఉంటే.. ఇంత పారదర్శకంగా జరుగుతున్న ఎన్నికల్లో గెలిచిచూపించాలని ప్రజలు అంటున్నారు.