మనిషి కనిపించిన వెంటనే, లేదా, పరిచయం అయిన వెంటనే.. ‘మీ కులం ఏమిటి?’ అని అడిగి తెలుసుకునే వారు.. నేరుగా అడగకుండా మనుషుల కులాలు ఏమిటో విచారించి, కనుక్కుని ఆ తర్వాతే పరిచయమైనా, స్నేహమైనా పెంచుకునే ప్రయత్నాల్లో ఉండే వారు.. త్వరగానే కనుక్కోగలరు గానీ.. సాధారణంగా అధికారుల కులాలు సామాన్యులకు తెలియవలసిన అవసరం లేదు. పేరు చివర్లలో కులచిహ్నాలైన పదాలు ఉంటే తప్ప తెలియదు. అయితే ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి విషయంలో మాత్రం ఆయన కులం ఇప్పుడు ప్రజలందరికీ స్పష్టంగానే తెలిసిపోయింది. అదికూడా- ఆయన అవినీతి, అరాచకాల పోలీసు కేసుల్లో ఇరుక్కుని, అరెస్టు అయి, కటకటాల వెనుకకు వెళ్లిన తరువాత!
పీఎస్సార్ ఆంజనేయులు ఒక సద్బ్రాహ్మణుడు అని ఇప్పుడు రాష్ట్రంలోని అందరికీ తెలుసు. బ్రాహ్మణుడనే సంగతి కొందరికి ఇదివరకే తెలిసిఉండవచ్చునేమో గానీ.. ఆయన సదాచార పరాయణుడైన, నిష్టాగరిష్టుడు, నిత్యానుష్ఠానం చేసే బ్రాహ్మణుడు అని అరెస్టు తర్వాత ప్రజలు తెలుసుకున్నారు. ఆయన తొలుత రిమాండుకు పంపినప్పుడు.. తాను అనునిత్యం సంధ్యావందనం చేసుకోవడానికి అవసరమైన వస్తువులను జైల్లోకి తీసుకువెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన కోర్టుకు నివేదించుకున్నారు. ప్రతిరోజూ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను కూడా అనుమతించాలని ఆయన కోరారు. జైల్లో ఉన్నా కూడా నిత్యం క్రమం తప్పకుండా సంధ్యావందనం చేయడం అంటేనే.. ఆయన నిష్ట చాలామందికి అర్థమైంది.
ఇప్పుడు ఆయనను విచారణ నిమిత్తం కోర్టు రెండురోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. ఆయనతో పాటు ఇదే గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు మూల్యాంకనం కేసులో మరో కీలకల నిందితుడు పమిడికాల్వ మధుసూదన్ ను కూడా పోలీసు కస్టడీకి అప్పగించారు. తొలిరోజు విచారణ పూర్తయిన తరువాత.. వారిని తిరిగి జైలుకు పంపడానికి ఆప్షన్ ఉంటుంది. అయితే.. పీఎస్సార్ ఆంజనేయులు మాత్రం.. తాను నిబంధనల ప్రకారం కస్టడీ ముగిసేవరకు పోలీసు స్టేషన్ లో ఉంటానని, తిరిగి జైలుకు వెళ్లనని పట్టుబట్టినట్టు సమాచారం. దీంతో జైలు గదిలోనే ఈ ఇద్దరికీ వేర్వేరు గదుల్లో రాత్రి నిద్రించే ఏర్పాట్లు చేశారు పోలీసులు.
తమాషా ఏంటంటే.. ఆ ఇద్దరు నిందితులకు మడత మంచాలు ఏర్పాటు చేయబోగా పీఎస్సార్ ఆంజనేయులు మాత్రం.. తాను నేలమీదనే నిద్రిస్తానని, తనకు నేలమీద పరుపు చాలు అని చెప్పారు. దీంతో పోలీసులు అలాగే ఏర్పాట్లు చేశారు. సదాచార పరాయణులు కొన్ని దీక్షల్లో ఉండేప్పుడు నేలమీదనే నిద్రిస్తుండడం జరుగుతుంది. పీఎస్సార్ ఆంజనేయులు కూడా కాదంబరి జెత్వానీని వేధించడం దగ్గరినుంచి, గ్రూప్ 1 ప్రహసనప్రాయమైన మూల్యాంకనం వరకు, జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి అనేక అడ్డదారులు తొక్కుతూ చెడ్డ పాపాలు చేసిన వ్యక్తి అయినప్పటికీ.. ఆచారాలు, పద్ధతుల పాటింపు విషయంలో మహా గొప్పగా ఉన్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.