నిరుపేదలు, అభాగ్యుల్ని వాడుకున్న జగన్ దళం!

‘మ్యూల్ ఖాతాలు’ అనే పేరుతో కొన్ని బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. అక్రమాలు చేసేవారికి.. కోట్లకు కోట్ల రూపాయలు తప్పుడు లావాదేవీలు చేసేవారికి ఈ మ్యూల్ ఖాతాలు అనేవి స్వర్గధామం వంటివి అన్నమాట. ఆన్ లైన్ మోసాలు చేసేవాళ్లు తమ పబ్బం గడిస్తే చాలు.. ఎవరో ఒకరిని బలిపశువుగా బుక్ చేసేద్దాం అనుకునే వాళ్లు ఇలాంటి మ్యూల్ ఖాతాలు వాడుతూ ఉంటారు. మ్యూల్ ఖాతా అంటే ఏమిటంటే.. ఎవరో అమాయకులైన పేదలు, అభాగ్యుల్ని సెలక్టు చేసుకుంటారు. వారి పేరుతో బ్యాంకు ఖాతా తెరుస్తాం అంటూ ఆధార్ కార్డు తీసుకుంటారు.. ఖాతా తెరుస్తారు. పాన్ కార్డు ఉన్న కొందరిని ఎంచుకుంటారు లేదా వారి పేరుతో పాన్ కార్డు కూడా వారికి తెలియకుండానే తామే తయారుచేయిస్తారు.  ఆ వివరాలు ఇచ్చినందుకు వారికి నెలకు వెయ్యిరూపాయలు ఇస్తాం అని ఆశ చూపెడతారు. నిరుపేదలకు ప్రతినెలా ఆ మాత్రం మొత్తం వస్తుందంటే కూడా మహాప్రసాదమే కదా.. వారు ఒప్పుకుంటారు. ఇక అక్కడినుంచి దందా మొదలవుతుంది. వారి ఖాతాల మీద ఇన్ కమ్ ట్యాక్స్ వారి దృష్టి పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూనే వీలైనంత ఎక్కువ లావాదేవీలు నడుపుతారు. వారి పేరుతో కోట్లరూపాయలు నగదుగా తీసుకుని.. వాటిని జాగ్రత్తగా ఆ ఖాతానుంచి ఇతర రూపాల్లోకి తరలిస్తారు. ఇంకా ఘోరం ఏంటంటే.. సదరు అభాగ్యుల వివరాలు చేతికి వచ్చిన తర్వాత వారిపేరుతో కంపెనీలు ఏర్పాటుచేసి ఆ కంపెనీల డొల్ల ఖాతాల్లోకి కూడా కోట్ల కొద్దీ లావాదేవీలు జరుపుతారు. ఇదంతా ఆర్థిక అక్రమాలు, ఆన్ లైన్ మోసాలకు పాల్పడే ముఠాలు, మాఫియాలు చేసే పని. అచ్చంగా జగన్మోహన్ రెడ్డి దళాలు కూడా ఇవే మార్గాల్ని లిక్కర్ కుంభకోణం కోసం వాడుకున్నాయి.

మద్యం డిస్టిలరీల నుంచి వాటాలుగా వసూలు చేసిన సొమ్ములను రూపు మళ్లించడానికి జగన్ మోహన్ రెడ్డి కి సంబంధించిన అక్రమాల నెట్ వర్క్ ఎంచుకున్న అనేక మార్గాల్లో ఇది కూడా ఒకటి అని తేలుతోంది. ప్రతినెలా  50-60 కోట్ల రూపాయల సొమ్ము వసూలు చేస్తూ వచ్చారు. ఈ సొమ్మును బంగారం రూపంలోకి మార్చి నిల్వ చేసుకోవడం, హవాలా రూపంలో ఇతర దేశాల్లోని డొల్ల కంపెనీలలోకి    పెట్టుబడులుగా తరలించడం వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అనేక మంది నిరుపేదల వివరాలను తమ అక్రమాల కోసం వాడుకున్నారు. విచారణ సాగుతున్న కొద్దీ.. పోలీసులు వారిని విచారిస్తే.. అసలు తమ పేరుతో అలాంటి కంపెనీలు ఉన్నట్టుగా కూడా వినలేదని వారు అవాక్కవుతున్నారు. ఒకవైపు తమది పేదల ప్రభుత్వం అని.. బుకాయింపు మాటలు వల్లించిన జగన్.. అనేక మంది పేదల బతుకుల్ని తన అక్రమార్జనలకు టూల్స్ గా వాడుకున్నారని ఇప్పుడు వారికి అర్థమవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories