బొత్స: అర్థంలేని, అవగాహనలేని మాటలు!

మాజీ మంత్రి, శాసనమండలి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ తనకు అలవాటైన పద్ధతిలో అర్థం పర్థంలేని డిమాండ్లు వినిపిస్తున్నారు. జూన్ 4న నిరసన దినోత్సవాలు నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో.. పార్టీ శ్రేణులను సమీకరించడానికి తన వంతు పాట్లు పడుతున్న బొత్స సత్యనారాయణ మాటలను గమనిస్తే.. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదో గమనిస్తున్నట్టుగా లేదు. తెలుసుకుంటున్నట్టుగా లేదు. ఏకపక్షంగా జగన్ ఏం చెబుతున్నాడో ఆ మాటలు మాత్రమే వింటూ.. జగన్ పంచిపెడుతున్న జ్ఞానంతో మాత్రమే తన వ్యాఖ్యలు వండివారుస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ప్రెస్ మీట్ పెట్టిన బొత్స సత్యనారాయణ.. చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఫ్లాప్ అయిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే శకునాలు పలుకుతున్నారు. తల్లికి వందనం ఎప్పుడిస్తారో చెప్పాలని అడుగుతున్న బొత్ససత్యనారాయణ మాటలు గమనిస్తే ఆయన అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఫాలో వుతున్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. జూన్ 12 లోగా తల్లికివందనం డబ్బు పంపిణీ పూర్తవుతుందని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అలాగే తన మరొక డిమాండుతో కూడా బొత్స సత్యనారాయణ కామెడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడం గురించి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ హామీ నెరవేరుతుండడం పట్ల ప్రజల్లో  హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే బొత్స సత్యనారాయణ మాత్రం ఈ విషయంలో కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇప్పటిదాకా విధివిధానాలు తయారు కాలేదని ఆయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏలుబడి సాగిన కాలంలో.. రెండున్నర నెలల ముందుగా ఏ పథకానికి వారు విధివిధానాలు తయారుచేశారో చెప్పాలని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

నిజం చెప్పాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంగ్ టైంలో రాంగ్ నిరసనలు తెలియజేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది అనే గడువు లేకుండా.. నిజంగా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాటి గురించి ఎప్పుడైనా సరే విపక్షం తమ నిరసనలు తెలియజేయవచ్చు. అలాకాకుండా.. హామీలు అమలు అవుతున్న సమయంలో.. మరికొన్ని రోజుల్లో కార్యరూపంలో రానున్నాయని అందరూ సంతోషిస్తున్న సమయంలో అదేహామీల గురించి చేయదలచుకుంటున్న నిరసనల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories