వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజం పేట ఎంపీ.. లిక్కర్ కుంభకోణంలో కూడా కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులు పలువురిని సిట్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి.. రిమాండులో ఉంచి, కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నెక్ట్స్ అరెస్టు అయ్యేది ఎవరు అనే చర్చ.. రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణంగా సాగుతున్న అంచనాల ప్రకారం.. తర్వాతి అరెస్టులు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ల వరకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. అరెస్టునుంచి రక్షణ ఉన్నప్పటికీ.. పోలీసులు తనను విచారణకు పిలుస్తారనే భయం మిథున్ రెడ్డిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు రావడానికి ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని వెతుక్కుంటున్నారు.
చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసే విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రజలకు ఒక ప్రధానమైన ఇబ్బంది ఎదురవుతోంది. రేషన్ వాహనం వచ్చే సమయానికి ప్రజలు ఇళ్లవద్దనే ఉండాలి. కూలి పనులకు, ఇతర ఊర్లకు వెళ్లి పనులు చేసుకునే వారికి ఇది చాలా పెద్ద ఇబ్బంది. వాహనం వచ్చిన సమయానికి ఇంటివద్ద మనిషి లేకుండా ఇక ఆ నెలకు సరుకులు ఇవ్వరు. అలా ఒకటి రెండు నెలలు సరుకులు తీసుకోవడం మిస్సయితే.. ఇక రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సతమతం అవుతూ వచ్చారు. పైగా ఈ ఎండీయూ వాహనాల ద్వారానే రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్ కూడా జరుగుతున్నదని.. ప్రభుత్వం గుర్తించింది. ఈ సకల అరాచకాలకు చెక్ పెట్టడానికి ఈ విధానం ప్రభుత్వం రద్దుచేసింది. నెలపొడవునా ప్రజలు ఎప్పుడు వెళితే అప్పుడు దుకాణాల వద్దనే రేషన్ సరుకులు ఇచ్చేలా పాత పద్ధతిని పునరుద్ధరించారు. ఇది ప్రజలకు సౌకర్యం కాగా.. దీని మీద కూడా వైసీపీ దళాలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి.
అన్నిటికంటె తమాషా ఏంటంటే.. ఎంపీ మిధున్ రెడ్డి ఈ విధానం గురించి మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చారు. ఎండీయూ వాహనాల రద్దు మంచి పద్ధతి కాదని ఒకవైపు అంటూనే.. అంతకంటె సుదీర్ఘంగా మద్యం కుంభకోణం గురించి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఎక్కడ వ్యవహారం తన అరెస్టు దాకా వస్తుందో అని భయపడుతున్న మిథున్ రెడ్డి.. జగన్ పాలనలో అసలు మద్యం కుంభకోణం జరగనేలేదని, లేని కుంభకోణాన్ని సృష్టించి వైసీపీ వారిని వేధించడానికి కూటమి సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నారు.. అని ప్రచారం చేసుకుంటున్నారు. మద్యంకుంభకోణం గురించి జరగనేలేదని చెప్పడం ఆయన టార్గెట్.. మీడియా ముందుకు వచ్చి కేవలం అదే టాపిక్ చెబితే జనం నవ్వుతారు గనుక.. రేషన్ వాహనాల రద్దు లాంటి రకరకాల టాపిక్ లు ఎన్నుకుని వాటి గురించి ఓ నిమిషం మాట్లాడి మద్యం కుంభకోణం విషయంలో తాను నిర్దోషి అని చాటుకోవడానికే అధిక సమయం వెచ్చిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు పాపాలు చేసినందుకు ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.