కెసిరెడ్డి అత్యాశకు బ్రేకులు వేసిన సుప్రీం!

ఏపీలో మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు స్వాహా చేసిన లిక్కర్ కుంభకోణంలో ఏ1 నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి, ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పోలీసులు అరెస్టు చేసినప్పుడు.. బెయిలు అడగడానికి ఎంత పెద్ద నేరస్తుడికైనా అధికారం ఉంటుంది. కానీ.. ఏకంగా తనను అరెస్టు చేయడమే చట్టవిరుద్ధం అంటూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సుప్రీం న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చట్టవిరుద్ధం అనడానికి మీవద్ద ఉన్న ఆధారం ఏమిటి? అంటూ ఎదురు ప్రశ్నించింది. మీ బెయిలు విజ్ఞప్తిని పరిశీలించగలం తప్ప.. అరెస్టు చట్టవిరుద్ధం అని తేల్చడం ద్వారా.. విచారణ ప్రక్రియ మొత్తం గందరగోళం కావడానికి కారణం కాలేం అన్నట్టుగా వ్యాఖ్యలు చేసింి.

లిక్కర్ కుంభకోణంలో తానే కర్త కర్మ క్రియగా మొత్తం వ్యవహారాలను నడిపించిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా స్పందించకుండా.. కనీసం విచారణకు హాజరుకాకుండా.. సుదీర్ఘాకాలం పరారీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరికి రేపు విచారణకు వస్తానంటూ పోలీసులకు మెయిల్ పంపి.. ఈలోగా వారి కనుగప్పి విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధంచేసుకున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలోనే అతడిని పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో ఆ సందర్భంలో స్పష్టంగా చెప్పారు. విజయవాడ వెళ్లిన తర్వాత.. కొన్ని ఇతర సెక్షన్లు కూడా కలిపి కేసు పెట్టారు. అదేమీ చట్టవిరుద్ధ ప్రక్రియ కాదు. అయితే తన అరెస్టు చట్ట విరుద్ధం అంటూ కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి సుప్రీం కోర్టు దాకా వెళ్లారు. ఆయనతోపాటు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా సుప్రీంలో పిటిషన్ వేశారు.  
కొడుకు పరారీలో ఉన్నప్పుడు.. పోలీసులు విచారణకు పిలిస్తే విజయవాడ వెళ్లి.. తన కొడుకుతో తనకు చాలాకాలంగా సంబంధాలు లేవని ఆయన ఎక్కడకు వెళుతున్నాడో తనకు చెప్పడని రకరకాల మాటలు వల్లించిన ఉపేందర్ రెడ్డి.. అక్కడనుంచి రాగానే తన కొడుకును చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. వీటిని విచారించిన ధర్మాసనం అలా తాము తీర్మానించలేం అని తేల్చేసింది. అరెస్టు కారణాలు చెప్పలేదని అనడం కూడా సబబు కాదని వ్యాఖ్యానించింది. ఒకవేళ మేం మీరు కోరినట్టు చెప్పినా సరే.. పోలీసులు విడుదల చేసిన వెంటనే.. చట్టబద్ధమైన ప్రక్రియలన్నీ పాటించి మళ్లీ అరెస్టు చేస్తే ఏం చేయగలరని వ్యాఖ్యానించింది. బెయిలు పిటిషన్ వరకు పరిశీలిస్తాం అని వాదనలు విని.. తీర్పును వాయిదా వేసింది.
మొత్తానికి బెయిలు అడగడంతో పాటు.. అరెస్టునే రద్దు చేయించుకోడానికి రాజ్ కెసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి స్కెచ్ వేశారు. కానీ వారి అత్యాశకు సుప్రీం బ్రేకులు వేసినట్లు అయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories