ఆయన గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత.. అంతటి కీలక నాయకుడిగా ప్రభుత్వలో నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగారు. గత ప్రభుత్వం సాగించిన అనేక అరాచక, అవినీతి కార్యకలాపాలకు తానే కేంద్రబిందువుగా వ్యవహరించారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదాహం చాలా ఎక్కువేనని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాస్త విలువైన భూమి కంటికి నదురుగా కనిపిస్తే చాలు.. దానిని కబ్జా చేసి.. ప్రభుత్వాధికారుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి దాన్ని తన సొంతం చేసుుకుంటూ ప్రభుత్వ రికార్డులను కూడా పుట్టించి మాయ చేయడం పెద్దిరెడ్డికి అలవాటే అని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఆయన తన సొంత కుటుంబ సభ్యుల పేరిట చేసిన మరో కబ్జా భాగోతం కూడా వెలుగులోకి వస్తోంది.
ఇప్పటికే అటవీ భూములను ఆక్రమించి అక్కడ జీవవైవిధ్యానికి కూడా హాని కలిగించినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కొడుకు, తమ్ముడు, మరదలుపై కూడా కేసులు నమోదై ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం ఆదేశాలు ఉన్నాయి. అటవీ భూములు మాత్రమే కాదు, తిరుపతి బుగ్గమఠానికి చెందిన భూములను ఆక్రమించిన కేసును కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. విచారణకు రాకుండా అధికారులతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయమైతే లెక్కేలేదు. అలాంటి ఒక ఆక్రమణను ఇప్పుడు రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆక్రమణ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాదాపు 15 కోట్ల రూపాయల ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించినట్టుగా ప్రజలు భావిస్తున్నారు.
మదనపల్లె పట్టణంలోనే ఈ ఆక్రమణ జరిగింది. మదనపల్లె బైపాస్ రోడ్డులోని బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో వైకాపా హయాంలో 3.4 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో ఉంది. ఈ భూమిని పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీదనే కొన్నారు. దీనిపక్కనే సర్వేనెంబరు 552/1లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు ఈ స్థలాన్ని కూడా ఆక్రమించేసి దానితో కలిపి కంచె వేసేసుకున్నారు. ఈ దందా మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరు ఆఫీసులో ఫైల్స్ దహనం చేసిన కేసులో కీలక నిందితుడు మాధవరెడ్డి నడిపించినట్టుగా చెబుతున్నారు. నిజానికి కొన్నట్టుగా రికార్డుల్లో ఉన్న భూమి కూడా దందాల్లో భాగంగా పొందినదే అని కూడా పుకార్లున్నాయి. ఈ ప్రాంతంలో ఎకరా 10 కోట్ల వరకు ధర పలుకుతుండగా.. పెద్దిరెడ్డి కబ్జాజేసిన భూమి విలువే 15 కోట్ల దాకా ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వ భూమి ని అన్నమయ్య జిల్లా కలెక్టరు శ్రీధర్ తిరిగి సర్వేచేయించి, ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుని అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. జనం మాత్రం.. పెద్దిరెడ్డి భూదాహం, కక్కుర్తి గురించే మాట్లాడుకుంటున్నారు.