బిగ్ బాస్ కోసం డబ్బు సంచులు మోసుకెళ్లడమే డ్యూటీ!

జగన్ కు అత్యంత విశ్వసనీయులు అయిన, ఆయన తరఫు సమస్త లావాదేవీలు చక్కబెట్టే వ్యక్తులుగా గత ప్రభుత్వ కాలంలో ముద్రపడిన ఇద్దరు మాజీ అధికారులను అరెస్టు చేసిన తర్వాత, వారిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టినప్పుడు  సిట్ పోలీసులు సమర్పించిన రిమాండు రిపోర్టు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను తెలియజేస్తోంది. జగన్ సర్కారులో సీఎంఓ కార్యదర్శిగా చేసిన ఐఏఎస్ ధనంజయరెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరూ కూడా.. వాటాలుగా వసూలు చేసిన నల్లధనాన్ని క్యాష్ రూపంలో బిగ్ బాస్ తరఫున అందుకుని, డబ్బు సంచులను తమ సొంత వాహనాల్లో తరలించి.. ఎక్కడకు చేర్చాలో అక్కడకు చేర్చడమే పనిగా వ్యవహరించారని.. ఈ క్రమంలో తాము కూడా భారీగా అనుచిత లబ్ధి పొందారని రిమాండు రిపోర్టు తేల్చింది. దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం సొమ్ము.. ఎప్పుడెప్పుడు ఎక్కడకు చేరింది.. అంతిమ లబ్ధిదారులు ఎవరు? ఏయే రూపాల్లో ఆ సొమ్మును వాడుకున్నారో- అవన్నీ సంపూర్ణంగా తెలిసిన వ్యక్తులు వీళ్లేనని రిమాండు రిపోర్టు తేల్చింది.

మద్యం కుంభకోణంలో నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీకోసం భారీగా డబ్బులు వచ్చేలాగా కొత్త పాలసీని రూపొందించండి అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశించిన మేరకే.. పాలసీ రూపకల్పన జరిగిందని గతంలో కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసుల విచారణలో చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆతర్వాత నిందితులుగా కేసులోకి వచ్చిన జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనంజయరెడ్డి భారతి సిమెంట్స్ డైరక్టర్ గోవిందప్ప బాలాజీ ముగ్గురూ కూడా ప్రస్తుతం అరెస్టు అయి రిమాండులో ఉన్నారు. ఈ మాజీ అధికార్లను అరెస్టుచేసిన తర్వాత కోర్టుకు హాజరుపరిచేసమయంలో ఇచ్చిన రిమాండు రిపోర్టులో మరిన్ని వివరాలు వెలుగుచూస్తున్నాయి.

కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి తన తోడల్లుడు, మరియు ఆత్మీయ మిత్రుల ద్వారా ఒక పెద్ద వసూళ్ల నెట్వర్క్ ను నడిపించారనే సంగతి అందరికీ తెలుసు. అలా డస్టిలరీల నుంచి పోగుచేసిన సొమ్ము మొత్తం ఆయన ఆఫీసుకు చేరుకునేది. జగన్ కు విశ్వాసపాత్రులైన ఈ అధికారులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ప్రతినెలా రాజ్ కెసిరెడ్డి ఆఫీసుకు వెళ్లి.. వసూళ్ల పర్వంలో ఎంత వ్యాపారం జరిగిందో దగ్గరుండి లెక్కలు చూసుకుని.. రాబోయే నెలకు ఎంత వసూళ్లు చేయాలో టార్గెట్లు ఇచ్చేసి.. వసూలైన సొమ్ము మొత్తాన్ని తమ వాహనాల్లోనే నింపుకుని తిరిగి వెళ్లేవారనేది తాజా అప్డేట్. వీరు ఇలా తీసుకెళ్లిన సొమ్ములను ఎక్కడెక్కడ డొల్ల కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టాలో..  ఆ వ్యవహారంలో కీలకంగా జగన్ కు ఆత్మీయుడు అయిన గోవిందప్ప బాలాజీ చూసుకునే వారు. ఈ పనులు చేస్తూ డిస్టిలరీలనుంచి వాటాలు కాజేసిన డబ్బుతో వీరందరూ కూడా భారీగా లబ్ధి పొందినట్టు కూడా రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు.

మొత్తానికి ఒక ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కి ఓఎస్డీ అయిన మరో అధికారి కీలకంగా నల్లధనం సంచులు మోసుకెళ్లి అధినేత ప్రాపకం కోసం పనిచేసే వారంటే ఆశ్చర్యం కలుగుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories