రాజకీయంగా అధికారంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీ అండదండలు ఉన్నాయి గనుక, తనకు ఎదురులేదని విచ్చలవిడిగా చెలరేగుతున్నప్పుడు గన్నవరం వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ ఎలా ఉండేవారో అందరికీ తెలుసు. అప్పటి ఆయన వైభవస్థితిని చూసిన వారికి ఇప్పుడు రిమాండులో కొన్ని నెలలుగా జైల్లో గడుపుతున్న వంశీని గమనించినప్పుడు జాలి కలుగుతోంది. మనిషి దీనంగా దయనీయంగా తయారయ్యారు. వంశీనేనా? అని పోల్చుకోవడం కూడా కష్టమయ్యేలా తయారయ్యారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయి జైలు పాలైన తర్వాత.. వల్లభనేని వంశీ ఇప్పటిదాకా 20 కిలోలు బరువు తగ్గినట్టుగా చెబుతున్నారు. ఇంత బరువు తగ్గిన తర్వాత.. ఆయన మెడమీద మరో కేసు భారం కూడా పడింది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా రిమాండులో గడుపుతున్న వంశీ మీద ఇది మరో కొత్త కేసు. నకిలీ ఇంటి పట్టాలతో ఓటర్లను ప్రభావితం చేసి మోసం చేయడానికి ప్రయత్నినంచినందుకు వంశీని ఈనెల 19 లోగా నూజివీడు కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వల్లభనేని వంశీ 2019లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నరోజుల్లో బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చారనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీకి ఇవ్వాలని బాపులపాడు పోలీసులు గురువారం నూజివీడు కోర్టులో పీటీ వారెంటు దాఖలు చేశారు. దీంతో.. ఇప్పటికే నెలలుగా జైల్లో ఉన్న వంశీ మరో కేసులో చిక్కుకున్నట్టు అయింది.
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అనుచరులతో దాడిచేయించడం, విధ్వంసంచేయించడం అనేది వల్లభనేని వంశీ మీద రిజిస్టరు అయిన తొలి కేసు. ఆ కేసును మాయ చేయడానికి వంశీ ఎంచుకున్న అడ్డదారి ఆయన మెడకు పామై చుట్టుకుంది. పార్టీ ఆఫీసుపై దాడికేసును పక్కదారి పట్టించడానికి, కేసు పెట్టిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి, నిర్బంధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించడం ద్వారా వంశీ ఇంకా చాలా పెద్ద తప్పు చేశారు. ఆ కేసులోనే ఆయన తొలుత అరెస్టు అయ్యారు. ఆ తర్వాత పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో కూడా అరెస్టు అయ్యారు. తర్వాత.. భూకబ్జా కేసుకూడా నమోదు అయింది. ప్రతి కేసులోనూ ఇప్పటికే పలుమార్లు వల్లభనేని వంశీ బెయిలు కోసం పిటిషన్లు వేస్తూనే ఉన్నారు గానీ.. సత్యవర్దన్ కిడ్నాప్ ఎపిసోడ్ ఉదాహరణగా చూపిస్తూ.. ఆయన బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని నమ్ముతున్న న్యాయస్థానం బెయిలు ఇవ్వడం లేదు. కాగా.. జైలో ఇప్పటికే ఇరవై కిలోల బరువు తగ్గిన వంశీ మద నకిలీ పట్టాలతో ఓటర్లను మోసం చేసిందుకు మరో కేసు నమోదుకావడం విశేషం.