3500 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతానికి కీలకమైన నిందితులు అందరూ విచారణ పరిధిలోకి వచ్చినట్టే. అంతిమ లబ్ధిదారుకు వాటాల డబ్బును చేరవేయడంలో అసలైన పాత్ర పోషించిన ముగ్గురూ పరారీలోంచి బయటకు వచ్చారు. అంతిమలబ్దిదారుకు చేరవేయడం కోసం వసూలైన మొత్తాలను అందుకున్న ముగ్గురు కీలక నిందితుల్లో గోవిందప్ప బాలాజీని సిట్ పోలీసులు సినిమాఫక్కీలో అరెస్టు చేయగా, ఆ ఒక్క అరెస్టు తో జడుసుకున్న మిగిలిన ఇద్దరు కీలక నిందితులు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి సిట్ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. మే16 వరకు తదుపరి చర్యలు చేపట్టవద్దని, అయితే నిందితులు విచారణకు హాజరు కావాలని సుప్రీం కోర్టు చెప్పిన పిమ్మట మాత్రమే వీరు అజ్ఞాతం వీడి.. సిట్ ఎదుటకు విచారణకు రావడం గమనార్హం.
మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో ఏ1 నిందితుడిగా కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి ని అరెస్టు చేయడంతో ఈ విచారణ కాస్త ఊపందుకుంది. ఆయనను విచారించడం ద్వారా.. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పన దగ్గరినుంచి సమస్త అక్రమ వ్యవహారాలు, వసూళ్ల బాగోతాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి సూచన, ఆదేశాల మేరకే చేసినట్టుగా పోలీసులు రిమాండు రిపోర్టు కూడా తయారుచేశారు. రాజ్ అరెస్టు తర్వాత.. చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టులు కూడా జరిగాయి. ఆ తర్వాత.. కీలకమైన ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలోకి చేర్చడం జరిగింది.
లిక్కర్ పాలసీ రూపకల్పనకు జరిగిన సన్నాహాల సమావేశాల దగ్గరినుంచి ప్రతి దశలోనూ కీలకంగా భాగం పంచుకోవడంతో పాటు, రాజ్ కెసిరెడ్డి తన నెట్వర్క్ ద్వారా వసూలు చేసిన సొమ్ములను, దాదాపు నెలకు 50-60 కోట్లరూపాయలను, అంతిమ లబ్ధిదారుకు చేరవేయడం అనే పనిని ఈ ముగ్గురే నిర్వహించేవారని తేలింది. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉంటూ భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు అన్నీ చూస్తూ ఉండే గోవిందప్ప బాలాజీ ముగ్గురూ నిందితులు అయ్యారు. అప్పటినుంచి వారు పరారీలోనే ఉంటూ హైకోర్టులోను సుప్రీం కోర్టులోను ముందస్తు బెయిలు పిటిషన్ నడిపారు. పోలీసుల విచారణ నోటీసులకు స్పందించలేదు.
సిట్ పోలీసులు వీరికోసం బృందాలుగా విడిపోయి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలించడం ప్రారంభించారు. మంగళవారం నాడు గోవిందప్ప బాలాజీ ని కర్నాటక లోని ఒక వెల్ నెస్ సెంటర్ లో అరెస్టు చేశారు. ఆయనకు బుధవారం న్యాయస్థానం 20 వరకు రిమాండు విధించింది. ఈలోగా 16వరకు తదుపరి చర్యలు వద్దంటూ సుప్రీం తీర్పు ఇవ్వడంతో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.