వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన కాలంలో.. ప్రభుత్వంలో నెంబర్ టూగా చెలామణీ అవుతూ.. కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలు అన్నింటినీ తన కనుసన్నల్లో నడిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడబోతున్నారు. కేవలం రామచంద్రారెడ్డి మాత్రమే కాదు. ఆయన తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాధరెడ్డి, కొడుకు- రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇబ్బందుల్లో పడబోతున్నట్టుగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో అటవీ భూముల్ని ఆక్రమించినందుకు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద అటవీ చట్టాలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించడమే ఇందుకు కారణం.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అక్కడితో ఊరుకోవడం లేదు. తమ ప్రభుత్వం ఉన్న కాలంలో పెద్దిరెడ్డి చెలరేగి ఆక్రమణలకు పాల్పడుతూ ఉంటే.. అడ్డుకోలేకపోయినా ఆయా శాఖల ఉన్నతాధికారులను కూడా బాధ్యుల్ని చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూములను ఆక్రమించినట్లుగా ఎంతోకాలంగా ఆరోపణలు ఉన్నాయి. సహజంగానే ఆ కుటుంబం ఆ ఆరోపణల్ని ఖండిస్తూ వస్తోంది. జగన్ తర్వాత పెద్దిరెడ్డి అంతటి చక్రం తిప్పే నాయకుడు గనుక వైసీపీ నాయకులందరూ కూడా ఆయనకు వత్తాసుగా గళం విప్పుతూ ఉండేవారు. పెద్దిరెడ్డి కోటరీ మొత్తం ఆక్రమణలు లేవు అంటారే తప్ప.. తమ వద్ద ఉన్న ఆధారాలతో ఎన్నడూ స్పష్టంగా వివరణ ఇచ్చింది కూడా లేదు. బుగ్గమఠం భూముల విషయంలో అయితే మరీ ఘోరం. పదేపదే పెద్దిరెడ్డికి నోటీసులు పంపినప్పటికీ.. తాను ప్రజాప్రతినిధిని గనుక.. తనకు ముందుగా షెడ్యూలు చేసిన కార్యక్రమాలు ఉంటాయని తాను రాలేనని బుకాయించడం తప్ప.. పెద్దిరెడ్డి వివరణ ఇవ్వలేదు.
మొత్తానికి అటవీ, ప్రభుత్వ, బుగ్గమఠం భూముల ఆక్రమణల విషయంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ విచారణ చేపట్టి.. పవన్ కల్యాణ్ కు నివేదిక అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆక్రమణలు ఆపలేకపోయిన/ ఉపేక్షించిన అధికారులందరినీ బాధ్యుల్ని చేయాలని ఆయన అందులో సూచించారు. అధికారులతో చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఇసుక కుంభకోణంలో కీలకంగా ఉన్నదని ఆరోపణలున్నాయి. వాటితోపాటూ ఇప్పుడు భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు కూడా చుట్టుకోవడం పెద్దిరెడ్డి కుటుంబానికి ఇబ్బంది కరమే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.